UPI Payments | ఫెస్టివ్ సీజన్లో యూపీఐ లావాదేవీలు మరింత పుంజుకున్నాయి. లావాదేవీల సంఖ్యతోపాటు విలువ కూడా పెరుగుతున్నది. గత నెలలో 1658 కోట్ల లావాదేవీలు జరిగితే, వాటి విలువ రూ.23.5 లక్షల కోట్లని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. 2023తో పోలిస్తే యూపీఐ లావాదేవీల సంఖ్యా పరంగా 45 శాతం, విలువ పరంగా 34 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ నెలలో 1500 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగితే గత నెలలో 1658 కోట్లకు పుంజుకున్నాయి.
ఇక రోజువారీగా సెప్టెంబర్లో ఐదు కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు జరిగితే, గత నెలలో అది 5.35 కోట్లకు చేరుకున్నది. ఫాస్టాగ్, ఆటోమేటెడ్ టోల్ పేమెంట్ సిస్టం ద్వారా ట్రాన్సాక్షన్లు ఎనిమిది శాతం పెరిగాయి. అయితే, బ్యాంక్ ఆధారంగా జరిగే ఐఎంపీఎస్ లావాదేవీలు మాత్రం ఐదు శాతం తగ్గి 46 కోట్లకు పరిమితం అయ్యాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ మంది డిజిటల్ లావాదేవీల నిర్వహణకే మొగ్గు చూపుతున్నారు.