హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): దేశంలో డిజిటల్ లావాదేవీలు రోజు రోజుకూ జోరందుకుంటున్నాయి. ప్రస్తుతం ఐదు రూపాయల కొత్తిమీరకు, రూ.ఐదు వేల షాపింగ్‌కు, లక్ష రూపాయల బంగారం కొనుగోలుకు కూడా యూపీఐ ద్వారానే చెల్లిపులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరి పర్సులో చూసినా డెబిట్, క్రెడిట్ కార్డులే తప్ప నగదు అంతగా కనిపించడం లేదు. ఈ ఏడాది జూన్ నాటికి దేశంలో రోజువారీ యూపీఐ లావాదేవీల సగటు 61.3 కోట్లు దాటిపోయింది. వాటి విలువ రూ.80 వేల కోట్లు. 2027 నాటికి రోజువారీ యూపీఐ లావాదేవీల సంఖ్య 100 కోట్లకు చేరుకుంటుందని నిపుణుల అంచనా. ప్రస్తుతం యూపీఐ లావాదేవీల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. ఎన్పీసీఐ డాటా ప్రకారం.. జూన్ నాటికి మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
2016లో సాధారణంగా ప్రారంభమైన యూపీఐ చెల్లింపులు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు 60 నుంచి 61.3 కోట్ల చొప్పున ప్రతి నెలలో 1,800 కోట్లకుపైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. 2017 జూన్‌లో యూపీఐ లావాదేవీల రోజువారీ సగటు 3.5 లక్షలుగా ఉండగా.. ఈ ఏడాది జూన్ నాటికి అది 1,750 రెట్లు పెరిగి 61.3 కోట్లకు చేరింది. ఇదే సమయంలో రోజువారీ యూపీఐ లావాదేవీల విలువ రూ.80 వేల కోట్లకు పెరిగింది.
ఎన్పీసీఐ డాటా ప్రకారం.. ఈ ఏడాది జూన్ నాటికి యూపీఐ లావాదేవీల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తెలంగాణ వరుసగా తొలి 4 స్థానాల్లో నిలువగా.. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ రూ.47.78 కోట్ల లావాదేవీలతో చిట్టచివరన ఉన్నది. గత నెల మహారాష్ట్రలో రూ.2,11,433.62 కోట్ల విలువైన 1,741.88 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. ఇది జూన్‌లో దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం యూపీఐ లావాదేవీల సంఖ్యలో 9.47 శాతానికి, విలువలో 8.80 శాతానికి సమానం. ఇదే సమయంలో తెలంగాణ వ్యాప్తంగా రూ.1,18,822.08 కోట్ల విలువైన 738.37 మిలియన్ల లావాదేవీలు జరిగినట్టు ఎన్పీసీఐ వెల్లడించింది.
సాధారణ వినియోగదారులు యూపీఐ ద్వారా రోజుకు 20 లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఆ లావాదేవీల మొత్తం విలువ రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ఉండొచ్చు.