హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు ఉద్దేశించిన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి.
మంగళవారం ఢిల్లీలో ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారులు కేంద్రమంత్రితో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. నెట్వర్ ఇంటిగ్రేషన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ నెట్వర్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలను టీ ఫైబర్‌కు అప్పగించాలని అధికారులు కోరగా దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. భారత్ నెట్ ఉద్యమి పథకాన్ని టీ ఫైబర్‌కు విస్తరించాలని అధికారులు కోరారు. దీనివల్ల రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు మరింత మెరుగవుతాయని చెప్పారు.