Gold | న్యూఢిల్లీ, మే 19: దేశంలోని ఆలయాలకు చెందిన బంగారాన్ని నగదీకరించే యోచనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఆలయ ట్రస్టులు లేదా మత సంబంధమైన సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉన్న పసిడి నిల్వలను కరిగించి మార్కెట్ వినియోగానికి తేనున్నారన్న సమాచారం అబద్ధమంటూ ఖండించింది. ఇవన్నీ వదంతులు, ఊహాగానాలేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇదంతా తప్పుదోవపట్టించే సమాచారమేనని, నిరాధార వార్తలని తోసిపుచ్చింది.
అలాగే ఆలయ శిఖరాలు, తలుపులు, ఇతరత్రా నిర్మాణాల్లో ఉన్నటువంటి పుత్తడిని ‘భారతీయ వ్యూహాత్మక పసిడి నిల్వలు’గా చూస్తున్నామన్న దానిలోనూ నిజం లేదని వివరించింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని, ప్రచారం కూడా చేయవద్దని ఈ సందర్భంగా విడుదలైన ప్రకటనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. నిజానిజాలను పట్టించుకోకుండా అసత్య వార్తలను వ్యాప్తి చేయడం ద్వారా ప్రజల్లో అనవసరపు గందరగోళం, భయాందోళనలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కాబట్టి అధికారిక ప్రకటనలనే నమ్మాలని దేశ పౌరులకు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు, అమలుపర్చే పథకాల వివరాలను పత్రికా ప్రకటనలు, మీడియా సమావేశాల ద్వారా తప్పక తెలియజేస్తామని వెల్లడించింది. ప్రభుత్వ వెబ్సైట్లలోనూ పొందుపరుస్తామని చెప్పింది.
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలను పరుగులు పెట్టిస్తున్న సంగతి విదితమే. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో అధిక ధరలు దేశంలోని విదేశీ మారకం (డాలర్ లేదా ఫారెక్స్) నిల్వలను కరిగించేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్ సభలో పొదుపు చర్యలకు ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. అలాగే చమురు దిగుమతుల తర్వాత ఎక్కువగా దిగుమతి అవుతున్న బంగారం, వెండి దిగుమతులను తగ్గించాలన్న ఉద్దేశంతో పలు నిర్ణయాలూ తీసుకున్నది తెలిసిందే. సుంకాల పెంపు, దిగుమతులపై ఆంక్షలు వచ్చిపడ్డాయి. ఇందులో భాగంగానే దేశ ప్రజల దగ్గరున్న సుమారు 35 వేల టన్నుల బంగారాన్ని ప్రభావవంతమైన పసిడి నగదీకరణ పథకంతో మార్కెట్ వినియోగానికి తేవాలని మోదీ సర్కార్ ప్రయత్నిస్తున్నట్టు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఆలయాల్లోని బంగారాన్నీ తీసుకుంటారన్న వార్తలు ఊపందుకున్నాయి. దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ పైవిధంగా స్పందించింది.
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో మదుపరులు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు దూసుకుపోయాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.800 అందుకొని రూ.1,63,600కి చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.1,62,800గా ఉన్నది. మరోవైపు, వెండి ధరలు భారీగా పడిపోయాయి. కిలో వెండి ఏకంగా రూ.5 వేలు తగ్గి రూ.2.71 లక్షలకు దిగొచ్చింది. పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ పడిపోవడంతోపాటు అంతర్జాతీయ మార్కె ట్లో డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటం వల్లనే వెండి ధరలు దిగొచ్చాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. ఇరాన్‌పై క్షిపణుల దాడిని ఆపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయన్నారు. ఫెడ్ మినిట్స్ విడుదల కానుండటంతో మదుపరులు వేచిచూసే ధోరణి అవలంభించారు.