Elon Musk | సరైన వ్యక్తి దొరికితే ట్విట్టర్‌ను విక్రయించనున్నట్లు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. 44 బిలియన్ డాలర్లకు ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను గతేడాది కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ట్విట్టర్ కంపెనీలో నెలకొన్న పరిస్థితులపై, కొనుగోలు అనంతరం అనుభవాలను ఆయన వెల్లడించారు. ట్విట్టర్‌ను టేకోవర్ చేయడంపై ఆయన సమర్థించుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను కొనుగోలు చేసినందుకు చింతించడం లేదన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ హెడ్‌క్వార్టర్స్‌లో తన ఆలోచనను వివరిస్తూ ‘ఇది బోరింగ్ కాదు. రోలర్‌కోస్టర్’లాంటిది.
గత కొన్ని నెలలుగా నిజం చాలా ఒత్తిడితో కూడున్న పరిస్థితి. పనిభారం సవాల్‌గా ఉంది. ఆఫీసులో నిద్రపోవాల్సి’ వస్తుందని మస్క్ పేర్కొన్నారు. ఎవరూ వెళ్లని లైబ్రరీలోని సోఫాపై తనకు స్థలం ఉందని పేర్కొన్నారు. వివాదాస్పద ట్వీట్లపై ప్రశ్నించగా.. బీబీసీ ‘ప్రభుత్వ నిధులతో కూడిన మీడియా’ కాదా అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్ కోసం చెల్లింపు గడువును సైతం ప్రకటించారు. ట్విటర్ ఖాతాల నుంచి లెగసీ బ్లూ చెక్-మార్క్‌లను ప్రక్షాళన చేయడానికి దృష్టి పెట్టిన మస్క్.. బ్లూ చెక్ మార్క్ కావాలనుకున్న యూజర్లు ఏప్రిల్ 20వ తేదీలోపు ఫీజు చెల్లించాలి లేకపోతే 20 నుంచి బ్లూ చెక్ మార్క్ కోల్పోతారని మస్క్ పేర్కొన్నారు.
మరో వైపు మస్క్ మూడో కంటికి తెలియకుండా ట్విట్టర్‌ను మరో కంపెనీలో విలీనం చేశారు. ఎక్స్ అనే ఎవ్రీథింగ్ యాప్‌లో ట్విట్టర్‌ను కలిపేసినట్టు ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ట్విట్టర్ సంస్థ స్వతంత్ర కంపెనీగా మనుగడలో లేదంటూ ఓ కేసు నిమిత్తం కోర్టుకు సమర్పించిన సమాచారంలో మస్క్ తెలిపారు. ఈ పరిణామాన్ని ధ్రువీకరిస్తూ ఎలాన్ మస్క్ ‘X’ అనే అక్షరాన్ని ట్వీట్ చేశారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ గతేడాది అక్టోబర్‌లో ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ట్విట్టర్లో పెను మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.
కంపెనీని కొనుగోలు చేసిన కొద్ది గంటల్లోనే సీఈవోగా కొనసాగుతున్న భారతీయ అమెరికన్ సీఈవో పరాగ్ అగర్వాల్‌తో పాటు ఉన్నత ఉద్యోగులను తొలగించాడు. ఆ తర్వాత సబ్స్క్రిప్షన్ మోడల్‌ను ప్రకటించాడు. ఇందులో భాగంగా ‘బ్లూ టిక్’ ఫీజు వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో మస్క్‌కు ఎదురుదెబ్బ తగిలింది. వివాదాస్పద నిర్ణయంతో అనేక కంపెనీలు బిలియన్ డాలర్లు నష్టపోయాయి. ఫలితంగా బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను నిలిపివేశాడు.