Mutual Funds | మ్యూచువల్ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు పెట్టాలని మీరు యోచిస్తున్నైట్టెతే.. అందుకు ఈ దీపావళియే సరైన సమయమని మెజారిటీ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. పైగా కొన్ని రంగాలను పరిశీలించాలని కూడా సిఫార్సు చేస్తున్నారు. వాటిలో మధ్య-చిన్నశ్రేణి ఐటీ కంపెనీలు, దేశీయ ఫార్మా సంస్థలు, పాత ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, టైర్ల తయారీ సంస్థల స్టాక్స్ అనుకూలంగా ఉన్నట్టు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. పలు దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో చిన్నచిన్న మొత్తాల్లో పెట్టుబడులకు దిగాలని కూడా ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తున్నారు.
ఇందుకోసం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్)ను ఎంచుకోవడం ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు. వీక్లీ, మంత్లీ, త్రైమాసిక పద్ధతుల్లో పెట్టుబడులకు వీలుంటుందని, వెయ్యి రూపాయలతో కూడా మదుపును మొదలు పెట్టవచ్చంటున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సిప్‌ల్లోకి నిధుల వరద మునుపెన్నడూ లేనివిధంగా రూ.24,509 కోట్లుగా ఉండటం గమనార్హం. మొత్తానికి ఔషధ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో పెట్టుబడులకు ఆకర్షణీయ రాబడులకు ఆస్కారం ఉందని పేర్కొంటున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు స్టాక్ మార్కెట్ రిస్కులకు లోబడి ఉన్నందున నిపుణులను సంప్రదించి పెట్టుబడులకు దిగితే ఇంకా లాభించవచ్చు. అంతేగాక స్వల్పకాలిక పెట్టుబడుల కంటే దీర్ఘకాలిక పెట్టుబడులు కలిసొస్తాయన్న వాదనలూ ఉన్నాయి.