న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన మదుపరులకు బాగానే కలిసొచ్చింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) నమోదిత సంస్థల మార్కెట్ విలువ 2025 మొదలు ఇప్పటిదాకా రూ.30.20 లక్షల కోట్లు పెరిగింది మరి. నిజానికి భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ నష్టాలు, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలు.. ఇలా మరెన్నో ఒడిదుడుకులు ఎదురైనా మదుపరులకు అంతిమంగా లాభాలే రావడం విశేషం. ఇందుకు కారణం దేశీయ రిటైల్, సంస్థాగత మదుపరుల కొనుగోళ్ల ఉత్సాహమేనని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు.
ఈ సంవత్సరం విదేశీ మదుపరులు భారతీయ మార్కెట్ల నుంచి గరిష్ఠంగా రూ.1.6 లక్షల కోట్ల (18 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటిదాకా బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 6,536.07 పాయింట్లు లేదా 8.39 శాతం పుంజుకున్నది. ఈ నేపథ్యంలోనే బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.30,20,376.68 కోట్లు పెరిగి రూ.4,72,15,483.12 కోట్ల (5.25 ట్రిలియన్ డాలర్లు) వద్ద స్థిరపడింది. గత ఏడాది ఏప్రిల్‌లో మార్కెట్ విలువ తొలిసారి రూ.400 లక్షల కోట్ల మార్కును తాకింది.

జోరుగా ఐపీవోలు
ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లలోకి పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చాయి. రికార్డు స్థాయి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లు నమోదయ్యాయి. వీటిలో టాటా క్యాపిటల్ రూ.15,512 కోట్ల పబ్లిక్ ఇష్యూనే టాప్. ఆ తర్వాత హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (రూ.12,500 కోట్లు), ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా (రూ.11,607 కోట్లు), హెక్సావేర్ టెక్నాలజీస్ (రూ.8,750 కోట్లు), లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ (రూ.7,278 కోట్లు), బిలియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ (రూ.6,632 కోట్లు) ఉన్నాయి. ఇదిలావుంటే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ల ద్వారా స్థిరంగా పెట్టుబడుల ప్రవాహం, పెరిగిన రిటైల్ మదుపరుల రాక, దీర్ఘకాలిక వృద్ధిపై నమ్మకం వంటివి మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయని నిపుణులు చెప్తున్నారు.
మార్కెట్ విలువలో సెన్సెక్స్ టాప్-5 కంపెనీల్లో (రూ.కోట్లలో)
రిలయన్స్ ఇండస్ట్రీస్ : 20,91,173
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ : 15,25,457.75
భారతీ ఎయిర్టెల్ : 11,86,978.75
టీసీఎస్ : 11,77,199.05
ఐసీఐసీఐ బ్యాంక్ : 9,60,478.36