హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): పరిశ్రమలకు భూ కేటాయింపులకు ఉద్దేశించిన గత కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన టీజీఐఐసీ విభాగం కార్యకలాపాలులేక పూర్తిగా పడకేసింది. గత నెల రోజులుగా అధికారులు గ్లోబల్ సమ్మిట్ పేరుతో కార్యాలయాలకు రాకపోవడంతో భూములు కేటాయించాలని కోరుతూ వచ్చే దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఆన్లైన్ విధానం అటకెక్కింది. పరిశ్రమల స్థాపనకు భూముల కేటాయింపు, అనుమతులకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ పేరుతో సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఆన్లైన్ ద్వారా వచ్చే దరఖాస్తులను పరిశీలించి వారం-వారం దరఖాస్తుదారులను ఇంటరూలకు పిలిచేవారు.
వారు పెట్టదలుచుకున్న యూనిట్‌కు సంబంధించి సంతృప్తికరమైన పత్రాలు అన్నీ ఉంటే వారికి భూ కేటాయింపులతోపాటు అన్ని అనుమతులూ వెంటనే మంజూరు చేసేవారు. ఈ ప్రక్రియంతా పక్షంరోజుల్లో ముగిసేది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినప్పటినుంచి ఈ విధానం పూర్తిగా నిలిచిపోయింది. తాము దరఖాస్తు చేస్తుంటే.. పత్రాలు అప్లోడ్ కావడంలేదని, టెక్నికల్ ఎర్రర్ అని వస్తున్నదని వారు వాపోతున్నారు. ఎలాగూ దరఖాస్తుల పరిశీలన, భూముల కేటాయింపును ప్రభుత్వం నిలిపివేసినందున దరఖాస్తులను నియంత్రించేందుకు టీజీఐఐసీ కావాలనే టెక్నికల్ సమస్యలు సృష్టించి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.