అమెరికా ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్ఠానికి తగ్గిందన్న వార్తతో కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున ర్యాలీ జరిపిన స్టాక్ మార్కెట్లు గతవారం తిరిగి ఒడిదుడుకుల బాటలోకి మళ్లాయి. 18,442 పాయింట్ల గరిష్ఠస్థాయివరకూ పెరిగిన నిఫ్టీ చివరకు 42 పాయింట్ల నష్టంతో 18,308 పాయింట్ల వద్ద ముగిసింది. ఆల్‌టైమ్ గరిష్ఠానికి సమీపంలో నిఫ్టీ తీవ్ర నిరోధాన్ని చవిచూస్తున్నందున సమీప భవిష్యత్తులో సూచీ ఒడిదుడుకుల బాటలోనే ఉంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అంచనా వేశారు. డిసెంబర్లో అమెరికా ఫెడ్ సమీక్ష వరకూ అంతర్జాతీయ ట్రెండ్‌ను నిఫ్టీ అనుసరిస్తుందన్నారు. డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఈ వారం హెచ్చుతగ్గులు కొనసాగుతాయని ఏంజిల్ ఒన్ బ్రోకింగ్ చీఫ్ అనలిస్ట్ సుమీత్ చౌహాన్ చెప్పారు.
నిఫ్టీకి సమీప భవిష్యత్తులో 18,400-18,500 శ్రేణి గట్టి అవరోధాన్ని కల్గిస్తుందని నిర్మల్ బంగ్ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ స్వాతి ఆనంద హోత్కర్ అంచనా వేశా రు. గతవారం ఈ శ్రేణిలో సూచీ ప్రవేశించినా అధిగమించలేకపోయిందని గుర్తుచేశారు. ఈ స్థాయిని బ్రేక్అవుట్ చేయలేకపోతే, 18,200 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు ఉన్నదని, ఈ దిగువన 18,000-17,900 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చని తెలిపారు. డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా 18,300 పాయింట్ల వద్ద పుట్ ఆప్షన్ల బిల్డప్, 18,400-18,500 స్ట్రయిక్స్ వద్ద కాల్ ఆప్షన్ బిల్డప్ జరిగిందున ఆయా స్థాయిలు మద్దతు, నిరోధాలుగా ఉంటాయని సుమీత్ చౌహాన్ వివరించారు. చార్టుల ప్రకారం 18,300-18,260 శ్రేణి మద్దతు అందించవచ్చని, 18,400-18,525 శ్రేణి అవరోధాన్ని కల్పించవచ్చన్నారు.