HomeBusinessThe Stock Market Is Reeling In A Bearish Bear Market
షాక్ మార్కెట్
బేర్స్ గుప్పిట్లో స్టాక్ మార్కెట్ విలవిలలాడుతున్నది. దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో వరుసగా నాలుగు ట్రేడింగ్ రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 2,447 పాయింట్లు పతనమయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 711 పాయింట్లు పడిపోయింది. ఇన్వెస్టర్లు దాదాపు రూ.10 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.
4 రోజుల్లో ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల నష్టం
ఇదేకాలంలో 2,400 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ముంబై, మార్చి 14: బేర్స్ గుప్పిట్లో స్టాక్ మార్కెట్ విలవిలలాడుతున్నది. దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో వరుసగా నాలుగు ట్రేడింగ్ రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 2,447 పాయింట్లు పతనమయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 711 పాయింట్లు పడిపోయింది. ఇన్వెస్టర్లు దాదాపు రూ.10 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను అక్కడి రెగ్యులేటర్లు తిరిగి తెరిచి డిపాజిటర్లకు ఊరట కల్పించినా అదానీ గ్రూప్‌పై పార్లమెంటులో జరిగిన రగడ, రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతంపైనే కొనసాగడం ఇక్కడి మార్కెట్‌ను దెబ్బతీసింది. తాజాగా సెన్సెక్స్ 338 పాయింట్ల నష్టంతో 57,900 పాయింట్ల సమీపంలో ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 111 పాయింట్లు క్షీణించి 5 నెలల కనిష్ఠస్థాయి 17,043 పాయింట్ల వద్ద నిలిచింది. మంగళవారం ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.1.96 లక్షల కోట్ల మేర కరిగిపోయింది. మార్చి 9-14 మధ్య రూ.9.64 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ రూ.266.24 లక్షల కోట్ల నుంచి రూ.256.59 లక్షల కోట్లకు తరిగిపోయింది.
ఐటీ ఇండెక్స్ డౌన్
సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా ఎం అండ్ ఎం 3 శాతం తగ్గింది. టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, కొటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్ షేర్లు 1-2.5 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు టైటాన్, భారతి ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్‌టీలు 1 శాతం వరకూ లాభపడ్డాయి. ఐటీ ఇండెక్స్ 1.4 శాతం మేర తగ్గింది. టెక్నాలజీ 1.08 శాతం, పవర్ 1.06 శాతం, రియల్టీ 1 శాతం, ఆటో 0.88 శాతం మేర తగ్గాయి. బ్యాంకెక్స్ 0.42 శాతం నష్టపోయింది. ఆసియా మార్కెట్లూ క్షీణబాట పట్టాయి. జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్ సూచీలు 2 శాతంపైగా క్షీణించగా, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 1.4 శాతం, చైనా షాంఘై 0.7 శాతం చొప్పున తగ్గాయి.
52 వారాల కనిష్ఠానికి 338 షేర్లు
వరుస నష్టాల మధ్య 338 కంపెనీల షేర్లు 52 వారాల కనిష్ఠస్థాయికి పడిపోయాయి. ఇందులో ‘ఏ’ గ్రూప్ షేర్లు 71 ఉన్నాయి. ఆరతి డ్రగ్స్, అదిత్యా బిర్లా ఫ్యాషన్, ఆదిత్యా బిర్లా సన్‌లైఫ్, బాలాజీ అమైన్స్, బంధన్ బ్యాంక్, బయోకాన్, బ్లూడార్ట్, సిప్లా, క్రాంప్టన్‌గ్రీవ్స్, ఇమామి, దివి ల్యాబ్స్, గ్రీవ్స్ కాటన్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లాంబార్డ్, ఇప్కా ల్యాబ్, డాక్టర్ లాల్ పాథ్‌లాబ్స్, ఎంఫసిస్, ముతూట్ ఫైనాన్స్, పేజ్ ఇండస్ట్రీస్ షేర్లు వాటి 52 వారాల కనిష్ఠస్థాయిల్ని తాకాయి. బీఎస్ఈలో 255 షేర్లు లోయర్ సర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అవగా, 138 షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి.
పతనానికి కారణాలు
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం: గతవారం యూఎస్‌లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌లో మొదలైన సంక్షోభం గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్‌ను బేరిష్‌గా మార్చివేసిందని ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాశ్ గోరాక్షర్ చెప్పారు. సిగ్నేచర్ బ్యాంక్ పతనం మరింత బలహీనపర్చిందన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా భారత మార్కెట్లో విక్రయాలు జరపడంతో పతనాన్ని చూస్తున్నదన్నారు.
ఫెడ్ రేట్ల పెంపు భయాలు: ఫెడరల్ రిజర్వ్ మరో దఫా వడ్డీరేట్లను పెంచుతుందన్న భయాలు మార్కెట్‌ను పడదోస్తున్నాయని అవినాశ్ తెలిపారు. రేట్ల పెంపునకు ఫెడ్ బ్రేక్పెడితే స్టాక్స్ కొంతమేర కోలుకోవచ్చని, రేట్లను మరింతగా పెంచితే ప్రపంచ మార్కెట్లతో పాటు భారత్ సైతం మరింత దెబ్బతింటుందని వివరించారు.
అదానీ గ్రూప్ షేర్ల పతనం: అదానీ గ్రూప్ షేర్లు పతనం కావడమూ ఓ కారణమే. అదానీ గ్రూప్ అవకతవకలపై జేపీసీ ఏర్పాటుకు పార్లమెంటులో ప్రతిపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ షేర్లు పడిపోయాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 7 శాతం, అదానీ పోర్ట్స్ 3 శాతం, అదానీ పవర్ 5 శాతం, అదానీ గ్రీన్ 3 శాతం తగ్గాయి.
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు: ఎఫ్‌పీఐలు మంగళవారం మార్కెట్లో పెద్ద ఎత్తున విక్రయాలు జరిపి రూ.3,097 కోట్లు వెనక్కు తీసుకున్నారు. గత నాలుగు రోజుల్లో వీరు రూ.7,200 కోట్లకుపైగా విలువైన షేర్లను నికరంగా విక్రయించారు.