హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్ పారిశ్రామిక వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. సబ్సిడీలకు సంబంధించి ఇప్పటికే రూ.3,500 కోట్లకుపైగా బకాయిలు పెండింగ్‌లో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజా బడ్జెట్లో ప్రోత్సాహకాలకు రూ.1,835 కోట్లు మాత్రమే కేటాయించడం ఇందుకు కారణం. ఈ నిధులన్నీ విడుదల చేసినా పాత బకాయిలకే సరిపోవని పారిశ్రామిక వర్గాలు పెదవి విరుస్తున్నాయి. రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ల కోసం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్లను నిర్మిస్తామని గత బడ్జెట్లో ప్రకటించిన రేవంత్‌రెడ్డి సర్కార్.. ఇంతవరకు ఒక్క జిల్లాలో కూడా ఆ కాంప్లెక్స్‌ను నిర్మించలేదు. గత రెండేండ్లలో కొత్తగా ఒక్క ఇండస్ట్రియల్ పార్కును కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు.
ఈసారి బడ్జెట్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీల ఊసే ఎత్తని కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా 2026-27 బడ్జెట్లో ప్రభుత్వం పరిశ్రమలు, వాణిజ్య శాఖకు సంబంధించిన వివిధ పథకాలకు రూ.3,641 కోట్లు, ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కు రూ.106 కోట్లు కలిపి మొత్తం రూ.3,747 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రోత్సాహకాలకు రూ.1,835 కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. తెలంగాణకు రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్టు ఊదరగొడుతున్న రేవంత్‌రెడ్డి సర్కార్.. పరిశ్రమల ఏర్పాటు కోసం పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసేందుకు ఎటువంటి ప్రయత్నం చేయడంలేదు.
ఓఆర్ఆర్, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రతిపాదించిన రేడియల్ రోడ్ వెంబడి కొడంగల్ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ (ఎంపీఐపీ)తోపాటు 3,245 ఎకరాల విస్తీర్ణంతో కూడిన జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిలో భాగంగా జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్టు తాజా బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. కానీ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీ కొత్త పథకం కాదు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇదివరకే నిధులు కేటాయించింది.
రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నవారికి గత రెండేండ్లుగా ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. ఆ బకాయిలు రూ.3,500 కోట్లకుపైగా ఉన్నాయి. ఇవన్నీ ఎంఎస్ఎంఈ క్యాటగిరీకి చెందినవే. అయినప్పటికీ తాజా బడ్జెట్లో పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.1,835 కోట్ల కేటాయింపులతో సరిపుచ్చడం గమనార్హం. ఆ నిధులతో కొత్తగా పరిశ్రమలు స్థాపించేవారికి ప్రోత్సాహకాలు ఇస్తారా? లేక పాత బకాయిలు కూడా చెల్లిస్తారా అనేదానిపై స్పష్టత లేదు. తాజాగా ప్రకటించిన ప్రోత్సాహకాల్లో చిన్నతరహా పరిశ్రమలు (ఎస్ఎస్ఐ), ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించిన పావలా వడ్డీ పథకానికి రూ.350 కోట్లు, పవర్ సబ్సిడీలకు రూ.250 కోట్లు, కొత్త ఇండస్ట్రియల్ జోన్ల ఏర్పాటుకు రూ.50 కోట్లు, 10 ఫార్మా విలేజ్ల భూసేకరణకు రూ.50 కోట్లు, రావిర్యాల ఈ-సిటీ ప్రాచేక్టుకు రూ.20 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు రూ.170 కోట్లు కేటాయించారు. కానీ, కేవలం రూ.50 కోట్లతో 10 ఫార్మా విలేజ్ల భూసేకరణ ఎలా సాధ్యమవుతుందో ఎవరికీ అంతుబట్టడం లేదు.