న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఆటోమొబైల్ రంగం టాప్‌గేర్‌లో దూసుకుపోవడానికి దోహదం చేయనున్నదని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ వెల్లడించారు. వాహన ధరలు భారీగా తగ్గనుండటంతో అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయే అవకాశాలున్నాయని తెలిపింది. ప్రస్తుత పండుగ సీజన్ అమ్మకాలు రెండంకెల వృద్ధి సాధించనున్నదని ఆశిస్తున్నట్టు సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు.
జీఎస్టీ వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను ఆటోమొబైల్ సంస్థలు ఇప్పటికే తమ వాహన ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి కూడా. అలాగే ఎగుమతులు కూడా 14 శాతం ఎగబాకి 7.7 లక్షల యూనిట్లు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. కార్లతోపాటు ద్విచక్ర వాహన అమ్మకాలు తిరిగి పుంజుకునేదశకు చేరుకున్నాయని, ప్రస్తుతం సింగిల్ డిజిట్లో వృద్ధి నమోదుకాగా, వచ్చే నెల నుంచి రెండంకెల స్థాయిలో ఉంటుందని ఆయన అంచనావేస్తున్నారు.