హైదరాబాద్, జనవరి 6 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏండ్లపాలనలో తయారీ రంగమే కాదు జీడీపీలో కీలకమైన సేవారంగం వృద్ధి కూడా మందగించింది. దేశీయ సేవల రంగం వృద్ధిరేటు డిసెంబర్లో ఎంతమాత్రం ఆశాజనకంగా లేదు. గత నెలలో కంపెనీల కార్యకలాపాల విస్తరణ, ఉత్పత్తి.. గడిచిన 11 నెలల్లోనే అత్యంత కనిష్ఠ స్థాయికి పతనమయ్యాయి. కొత్త నియామకాలకు కంపెనీలు దూరంగా ఉండటం దీనికి అద్దం పడుతున్నది. ఈ మేరకు హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) వ్యాపార కార్యకలాపాల సూచీ వెల్లడించింది. డిసెంబర్లో సూచీ పాయింట్లు 58కి దిగజారినట్టు వివరించింది. అంతకుముందు నెల నవంబర్‌లో 59.8గా ఇది రికార్డయ్యింది.
పారిశ్రామిక అవసరాల నిమిత్తం కంపెనీలు నియామకాలను చేపడుతూ ఉంటాయి. అయితే, గత నెలలో సర్వే చేసిన కంపెనీల్లో 96 శాతం కంపెనీలు కొత్త నియామకాలను చేపట్టలేదని వెల్లడించాయి. గత నెలలో కొన్ని కంపెనీలు ఉద్యోగులను తీసివేసినట్టు వివరించాయి. ఉద్యోగ నియామకాల్లో స్తబ్ధత గడిచిన 42 నెలల్లో ఇదే మొదటిసారని నివేదిక వెల్లడించింది. భవిష్యత్తు కార్యకలాపాలపై వ్యాపార వర్గాల్లో విశ్వాసం కూడా సన్నగిల్లినట్టు నివేదిక తెలిపింది. వరుసగా గత మూడు నెలలుగా కొనసాగుతున్న ఈ పరిణామం గడిచిన మూడున్నరేండ్లలో అత్యంత కనిష్ఠ స్థాయికి చేరినట్టు నివేదిక వివరించింది. మొత్తంగా మోదీ ప్రభుత్వ విధానాలతో అటు వ్యాపార వర్గాల్లో విశ్వాసం సన్నగిల్లడంతోపాటు ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోవాల్సి వస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి.
పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) అంటే తయారీ, సేవా రంగాల్లో సైప్లె మేనేజర్స్ నెలవారీ సర్వేల ఆధారంగా ఉండే ఓ ప్రధాన ఆర్థిక సూచీ. దేశంలో వ్యాపార తీరుతెన్నులు, మార్కెట్ డిమాండ్, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, ఉత్పత్తి, పెట్టుబడులు తదితర అంశాలను ఇది ప్రతిబింబిస్తుంది. పీఎంఐ సూచీని బట్టి ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థపై స్థూలంగా ఓ నిర్ణయానికి వస్తాయి. అవసరమైన విధానాలను అమలు చేస్తాయి. ఎకనామిక్ ట్రెండ్స్‌కు కూడా దీన్నే కొలమానంగా భావించవచ్చు. జీడీపీ, ద్రవ్యోల్బణం గణాంకాలపై ఓ అవగాహనను సైతం పీఎంఐ ద్వారా ఏర్పర్చుకోవచ్చు. బిజినెస్ ప్లానింగ్గానే గాక, ఇన్వెస్ట్మెంట్ టూల్‌గా కూడా ఇది పనిచేస్తుంది.
జీడీపీలో సర్వీస్ సెక్టార్ వాటా 55.3%
11 నెలల కనిష్ఠం
వృద్ధిరేటు మందగమనం
ఉద్యోగ నియామకాల్లో స్తబ్ధత
42 నెలల్లో తొలిసారి
మూడున్నరేండ్ల కనిష్ఠానికి..
వ్యాపార వర్గాల్లో విశ్వాసం