Rupee | ముంబై, డిసెంబర్ 16: రూపాయి విలువ మరింత క్షీణించింది. సోమవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే రూపీ మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠానికి దిగజారింది. ఈ ఒక్కరోజే మరో 11 పైసలు పడిపోయి మునుపెన్నడూ లేనివిధంగా 84.91 స్థాయికి పతనమైంది. పెరిగిన అమెరికా బాండ్ ఈల్డ్స్, దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్.. రూపీని కూలదోశాయని ఫారెక్స్ ట్రేడర్లు చెప్తున్నారు. ఇక ఉదయం ఆరంభంలో రూపీ ట్రేడింగ్ 84.83 వద్ద మొదలైంది.
ఈ క్రమంలోనే ఒకానొక దశలో 84.93 స్థాయికి తగ్గింది. అయితే చివర్లో కాస్త కోలుకొని 84.91 వద్ద స్థిరపడింది. శుక్రవారం కూడా రూపాయి 8 పైసలు కోల్పోయి రికార్డు స్థాయిలో 84.80 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. కాగా, గతకొద్ది రోజులుగా ఫారెక్స్ మార్కెట్లో డాలర్ ముందు రూపాయి వెలవెలబోతూనే ఉన్నది. దీంతో దేశీయ దిగుమతులు భారంగా మారుతున్నాయి. పరిస్థితులు మరింత దిగజారకుండా రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.