భారత ఆర్థిక వ్యవస్థకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అమెరికా డాలర్ ముందు దేశీయ కరెన్సీ రూపాయి నిలబడలేకపోతున్నది మరి.
ఫారెక్స్ మార్కెట్లో మునుపెన్నడూలేనివిధంగా నష్టాలను చవిచూస్తున్నది. రోజుకింత పడిపోవడంతో ఆల్‌టైమ్ కనిష్ఠాలు నమోదవుతుండటం అన్నింటిపైనా ఒతిళ్లను పెంచుతున్నది.
చివరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రంగంలోకి దిగినా పరిస్థితుల్లో మార్పులు లేకపోవడం కలవరపాటుకే గురిచేస్తున్నది. ఫలితంగా ఖర్చులు పెరిగి, రుణాలు ఖరీదెక్కి, దిగుమతులు భారమై.. మళ్లీ ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మంగళవారం ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి దిగజారింది. ఫారెక్స్ ట్రేడింగ్‌లో తొలిసారి 88.80 వద్దకు పడిపోయింది. ఒకానొక దశలోనైతే 88.85 శ్రేణికి క్షీణించింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకే ముప్పు తెచ్చిపెట్టేలా ఉందని మెజారిటీ నిపుణులు హెచ్చరిస్తుండటం గమనార్హం.
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ అంతకంతకూ బలహీనపడుతుండటం వెనుక ప్రధాన కారణాల్లోకి వెళ్తే.. తమ దేశంలోకి దిగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద ఎత్తున సుంకాలు విధించడం, దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల పెట్టుబడులు క్రమేణా వెనక్కి పోతుండటం, హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచడం ఉన్నాయని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే రాబోయే రోజుల్లో అమెరికాలో ఉన్న భారతీయులు స్వదేశానికి పంపే రెమిటెన్సులు, ఐటీ రంగ ఎగుమతులు కూడా తీవ్రంగానే ప్రభావితం కావచ్చన్న అంచనాలున్నాయి. ఇక అంతకంతకూ పడిపోతున్న రూపాయి విలువతో అనేక సవాళ్లు ఎదురవుతాయి. వాటిని పరిశీలిస్తే..
రూపాయి విలువ పడిపోయినకొద్దీ విదేశాల నుంచి దేశంలోకి దిగుమతయ్యే ప్రతీదాని ధర పెరుగుతూపోతుంది. చెల్లింపులు డాలర్లలో జరగడమే కారణం. ముఖ్యంగా ముడిచమురు, కన్జ్యూమర్ గూడ్స్ రేట్లకు రెక్కలు తొడుగుతాయి. దీంతో ఇంధన ధరలు ఎగిసి మొత్తం ద్రవ్యోల్బణమే ప్రభావితమవుతుంది. ఆర్బీఐ వడ్డీరేట్లు ఎగబాకి రుణ లభ్యత మందగిస్తుంది. మరోవైపు ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లి, తయారీ రంగం కుంటుబడుతుంది. నిరుద్యోగం విజృంభించి చివరకు జీడీపీ క్షీణించగలదు.
రూపీ వాల్యూ క్షీణించినకొద్దీ విదేశాల్లో చదువుతున్న భారతీయుల ఖర్చులు పెరుగుతూపోతాయి. తల్లిదండ్రులు, విద్యార్థులు ట్యూషన్ ఫీజులకు, వసతి, ఆహారంతోపాటు రోజువారీ అవసరాలకు ఎక్కువ చెల్లింపులు చేయాల్సి వస్తుంది. విద్యా రుణాలు కూడా భారమై వాటి చెల్లింపులు కష్టతరంగా మారుతాయి.
పెట్టుబడులపై ఇప్పటికే రూపాయి నష్టాల ప్రభావం కనిపిస్తున్నది. ఈ ఏడాది ఆరంభం నుంచి విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) భారతీయ ఈక్విటీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. కేవలం జూలై మొదలు సెప్టెంబర్ తొలి వారం వరకే లక్ష కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులు తరలిపోయాయి. రూపాయి పతనం కరెన్సీ నష్టాలకు దారితీయవచ్చన్న ఆందళనలు ఎఫ్ఐఐల్లో నెలకొన్నాయి.
విదేశాలకు వెళ్లేవారికి మరింత నగదు అవసరం అవుతుంది. ఆయా దేశాల్లో ఖర్చులన్నీ భారంగా పరిణమిస్తాయి. దిగుమతి చేసుకొనే మొబైల్స్, కంప్యూటర్లు, ఇతర పరికరాలన్నింటి ధరలు పెరుగుతాయి. వీటిని కొనేందుకు ఇంకాఇంకా చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి.
విదేశాల నుంచి తీసుకున్న రుణాలకు చెల్లింపులన్నీ కూడా భారంగా మారుతాయి. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, కార్పొరేట్ కంపెనీల ఆర్థిక శక్తి కూడా దెబ్బతింటుంది. కాబట్టి రూపాయి విలువ పెరిగి బలపడితేనే అంతా బాగుంటుంది లేకపోతే అస్తవ్యస్తమే. మరి రూపీ నష్టాలు ఇంతటితో ఆగుతాయో.. లేక ఇంకా కొనసాగుతాయో చూడాల్సిందే.