ముంబై, డిసెంబర్ 1: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మళ్లీ పడిపోయింది. సోమవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో 8 పైసలు క్షీణించి 89.53కు పతనమైంది. అయితే ఒకానొక దశలో మునుపెన్నడూ లేని స్థాయికి నష్టపోవడం గమనార్హం. తొలిసారి 89.79కి దిగజారింది. రూపీకి ఇంట్రా-డేలో ఇదే అత్యంత కనిష్ఠం. దీంతో గత నెల 21న నమోదైన 89.66 స్థాయి కనుమరుగైపోయినైట్టెంది. నిజానికి ఆ రోజున రూపాయి అక్కడే ముగిసింది. దీంతో ఇప్పటికీ క్లోజింగ్‌లో అదే ఆల్‌టైమ్ కనిష్ఠం.
ఇదిలావుంటే మార్కెట్లో డాలర్‌కు పెద్ద ఎత్తున డిమాండ్ రావడం.. రూపాయిని బలహీనపర్చింది. అయితే అమెరికా-భారత్ మధ్య వాణిజ్య లోటు పెరుగుతుండటం, ఇరు దేశాల నడుమ వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతుండటం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం పరిమితంగానే ఉంటుండటం వంటివి రూపాయి నష్టాలను పెంచుతున్నాయని ఫారెక్స్ ట్రేడర్లు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. కాగా, ఉదయం ఆరంభంలో 89.45 వద్ద రూపాయి మొదలైంది.