న్యూఢిల్లీ, నవంబర్ 28: ఐటీ దిగ్గజం టీసీఎస్ ప్రకటించిన రూ.17,000 కోట్ల బైబ్యాక్ ప్రక్రియ డిసెంబర్ 1న ప్రారంభం కానుంది. డిసెంబర్ 7న ముగుస్తుంది. ఈ బైబ్యాక్‌లో ఇన్వెస్టర్లు వారి వద్దనున్న టీసీఎస్ షేర్లను ఒక్కోదానిని రూ.4,150 ధరకు విక్రయించుకోవచ్చు.
ఈ బైబ్యాక్ పథకంలో టీసీఎస్ తన మొత్తం ఈక్విటీలో 1.12 శాతం షేర్లను (4.09 కోట్ల షేర్లు) టీసీఎస్ కొనుగోలు చేయనుంది. రూ.2 లక్షల లోపు పెట్టుబడి కలిగిన చిన్న ఇన్వెస్టర్లకు ప్రతీ 6 షేర్లకు ఒక షేరును యాక్సెప్టెన్సీ రేషియోగా నిర్ణయించినట్టు టీసీఎస్ మంగళవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. అంటే 6 షేర్లను చిన్న మదుపరులు కంపెనీకి అమ్మేందుకు టెండర్ సమర్పిస్తే ఒక షేరును తీసుకుని రూ.4,150 ధరను టీసీఎస్ చెల్లిస్తుంది.
మిగిలిన షేర్లను ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చేస్తుంది. అలాగే ఇతర అర్హమైన ఇన్వెస్టర్లకు ప్రతీ 209 షేర్లకు 2 షేర్లు యాక్సెప్టెన్సీ రేషియోగా నిర్ణయించారు. బైబ్యాక్ ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం బీఎస్ఈలో ఈ షేరు ధర రూ. 3,470 వద్ద ముగిసింది.