న్యూఢిల్లీ, ఆగస్టు 17: దేశంలో ధరలు మరికొంతకాలం గరిష్ఠస్థాయిలోనే కొనసాగుతాయని రిజర్వ్‌బ్యాంక్ అంచనా వేస్తున్నది. ప్రస్తుత జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువనే నిలిచిఉంటుందని గురువారం విడుదలైన 2023 ఆగస్టు బులెటిన్‌లో ఆర్బీఐ పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో 4.3 శాతానికి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం రెండు నెలల్లో వేగంగా పెరిగి జూలైలో 7.4 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా పెరిగిన టమోటా ధరలు ఇతర కూరగాయలకు సైతం వ్యాపించడంతో జూన్‌తో పోలిస్తే జూలైలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ బులెటిన్‌లో వివరించారు. కూరగాయల ధరలు త్వరితంగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఎల్ నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ ఆహారోత్పత్తుల ధరల్ని నిశితంగా గమనించాల్సి ఉందన్నారు. అలాగే జూలైలో ఖరీఫ్ పనులు సజావుగా జరిగినా, అసమాన వర్షపాతం ప్రభావాన్ని జాగ్రత్తగా చూడాల్సి ఉందన్నారు.
మందకొడి ప్రపంచం
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వృద్ధి పటిష్ఠంగా ఉన్నా, గ్లోబల్ రికవరీ మందకొడిగా ఉన్నదని కేంద్ర బ్యాంక్ తెలిపింది. పారిశ్రామికోత్పత్తి, వాణిజ్యం తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమన్నది. అంతర్జాతీయ అనిశ్చితితో సవాళ్లు ఎదురవుతున్నా, 2023-24 ద్వితీయ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ జోరందుకున్నదని, ఎగుమతుల క్షీణత ద్వారా ఏర్పడిన తగ్గుదలను దేశంలో ప్రైవేటు వినియోగం, స్థిర పెట్టుబడులు వృద్ధిని సమతౌల్యం చేస్తున్నాయని ఆర్బీఐ వివరించింది. మరో వైపు ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని హెచ్చరించింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని 2023-24 క్యూ2లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. క్యూ3లో 5.7 శాతం, క్యూ4లో 5.2 శాతం చొప్పున నమోదవుతుందని, 2024-25లో 5.2 శాతానికి పరిమితమవుతుందని రిజర్వ్‌బ్యాంక్ వివరించింది.