తాజా ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగానే ఉన్నదన్న సంకేతాలను ఇస్తుండటం గమనార్హం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను అధికారికంగా విడుదల చేసిన జీడీపీ గణాంకాల్లో దేశ ఆర్థిక వృద్ధిరేటు నాలుగేండ్ల కనిష్ఠానికి పతనమైనట్టు తేలిన విషయం తెలిసిందే. ఈసారి 6.5 శాతంగానే నమోదైంది. 2020-21 తర్వాత ఈ స్థాయిలో జీడీపీ గణాంకాలుండటం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో దేశీయంగా వినిమయ సామర్థ్యాన్ని పెంచేందుకు, ప్రజల చేతుల్లో మరింత నగదును ఉంచేందుకు అనుగుణంగా ఈ ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ పలు నిర్ణయాలు తీసుకున్నది. ఇందులోభాగంగానే ఏకంగా రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు ఆర్బీఐ తగ్గించిందన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కరోనా విజృంభించిన 2020లోనూ రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి విదితమే. రెపో రేటు తగ్గితే బ్యాంక్ రుణాలపై వడ్డీరేట్లు తగ్గి మార్కెట్లో నీరసించిన కొనుగోళ్లు తిరిగి ఊపందుకుంటాయన్నదే దీని వెనుకున్న అసలు ఉద్దేశం.
ఆర్బీఐ తీసుకున్న మరో నిర్ణయం కూడా దేశ ఆర్థిక మందగమనాన్ని తేటతెల్లం చేస్తున్నది. సుదీర్ఘ విరామం తర్వాత సీఆర్‌ఆర్‌ని ఆర్బీఐ ఏకంగా 1 శాతం తగ్గించింది. తాజా ద్రవ్యసమీక్షలో 4 శాతం నుంచి 3 శాతానికి తీసుకొచ్చింది. ఈ నిర్ణయం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.2.5 లక్షల కోట్లు అదనంగా వచ్చి చేరనున్నాయి. దీంతో రుణ లభ్యత మరింత పెరగనున్నది. కరోనా పరిస్థితుల ప్రభావంతో దిగాలుపడిన దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపర్చేందుకు 2020 మార్చి 27న కూడా ఇలాగే 100 బేసిస్ పాయింట్ల (1 శాతం) మేర సీఆర్ఆర్ను ఆర్బీఐ తగ్గించింది. ఇక ఆయా వస్తూత్పత్తుల కొనుగోళ్లకు, వివిధ రంగాల్లో ఉత్పాదకత పెంపునకు సీఆర్ఆర్ తగ్గింపు దోహదం చేయనున్నది. ఇదే జరిగితే గాడి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడినపడి.. జీడీపీ వృద్ధిరేటు మళ్లీ పట్టాలెక్కి పరుగులు పెడుతుందన్న ఆశలు అటు ఆర్బీఐ, ఇటు కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తున్నది.
ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను మునుపెన్నడూ లేనివిధంగా కేంద్రానికి ఆర్బీఐ డివిడెండ్‌ను అప్పజెప్పడం కూడా దేశ ఆర్థిక విపత్కర పరిస్థితికి అద్దం పడుతున్నదనే చెప్పవచ్చు. 2024-25కుగాను రికార్డు స్థాయిలో రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్‌ను ఆర్బీఐ ఈమధ్యే ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2023-24)తో పోల్చితే ఇది 27 శాతం ఎక్కువ. నాడు 2.11 లక్షల కోట్లు ఖజానాకు చేర్చింది. దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనంతో సర్కారీ ఆదాయం పడిపోతుండటం, ఖర్చులు-రుణ భారం పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వ సంస్థల డివిడెండ్లే దిక్కవుతున్నది. ఈ క్రమంలోనే ఆర్బీఐ నుంచి వీలున్నంత వరకు కేంద్రం పిండుకుంటున్నదన్న విమర్శలున్నాయి. నిజానికి మోదీ సర్కారు వైఖరి, భారీ డివిడెండ్ల కోర్కెలు నచ్చకనే ఆర్బీఐ మాజీ గవర్నర్లు రాజన్, పటేల్‌లు తప్పుకున్నారన్న వార్తలూ ఉన్నాయి. అయితే వీరి తర్వాత వచ్చిన శక్తికాంత దాస్, ఇప్పుడున్న మల్హోత్రాలు మాత్రం ఆర్బీఐ మిగులు నగదు నిల్వలతో ఖజానాను నింపేస్తున్నారు. కానీ ఆర్బీఐ వద్ద నిధులు ఎక్కువగా ఉంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ బాగుంటుందని, డివిడెండ్లు ఈ లక్ష్యాలకు గండి కొడుతున్నాయన్న ఆందోళనలు ఆర్థిక నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.