(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై ఏప్రిల్ 1 నుంచి ఇంటర్చేంజ్ ఫీజులు వసూలు చేయనున్నట్టు యూపీఐ లావాదేవీలను పర్యవేక్షిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) మంగళవారం ప్రకటించింది. రూ.2,000, ఆపై లావాదేవీలపై 1.1 శాతం వరకు ఈ రుసుము ఉండనున్నట్టు వెల్లడించింది. ‘డిజిటల్ ఇండియా’ పేరిట ఆన్లైన్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామంటూ గప్పాలుకొట్టిన కేంద్రప్రభుత్వం.. యూపీఐ లావాదేవీలపై బాదుడు మొదలు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్చేంజ్ ఛార్జీల వల్ల సామాన్యులపై భారం పడుతుందంటూ అన్నివర్గాల నుంచి వ్యతిరేకత కనిపిస్తున్నది. దీంతో ఎన్పీసీఐ బుధవారం వివరణ ఇచ్చింది. బ్యాంకు ఖాతా నుంచి ఖాతాకు (పీ2పీ), వినియోగదారులకు-వినియోగదారులకు, వ్యాపారులకు (పీ2పీఎం) మధ్య జరిగే లావాదేవీలు ఉచితమేనని తెలిపింది. ఇదేసమయంలో ఆన్లైన్ వ్యాలెట్లు, ప్రీ-లోడెడ్ గిఫ్ట్ కార్డులు, ప్రీపెయిడ్ సాధనాల ద్వారా జరిగే ‘ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్’ (పీపీఐ) వ్యాపారి లావాదేవీలకు మాత్రమే ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంటూ ఎన్పీసీఐ అసలు మెలిక పెట్టింది. ఈ నిర్ణయంపై నిపుణులు మండిపడుతున్నారు. పీపీఐ లావాదేవీలపై వేసే చార్జీలు అంతిమంగా కస్టమర్‌కే పెనుభారంగా మారుతాయని చెబుతున్నారు.
లావాదేవీ జరిగినప్పుడు పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లతోపాటు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల అధీకృత సంస్థలు.. బ్యాంకులకు చెల్లించే మొత్తాన్నే ఇంటర్‌ఛేంజ్ చార్జీ అంటారు. లావాదేవీల ధ్రువీకరణ, ప్రాసెసింగ్‌కు అయ్యే వ్యయాల కోసం ఈ చార్జీని బ్యాంకులు ఆయా సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వసూలు చేస్తాయి. ఎన్పీసీఐ ప్రకటన ప్రకారం.. పీపీఐ ద్వారా రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీ జరిపితే.. 1.1 శాతం ఇంటర్‌ఛేంజ్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వ్యాలెట్ లోడింగ్ సేవా రుసుము దీనికి అదనం. ఈ లెక్కన.. పేటీఎం, మొబిక్విక్, పేయూమనీ, ఫ్రీ-రీచార్జీ, పేజ్యాప్, అమెజాన్ పే, గూగుల్ పే వంటి పీపీఐ జారీ సంస్థలు.. వ్యాలెట్ లోడింగ్ చార్జీని ఖాతాదారుడి బ్యాంకుకి చెల్లించాల్సి ఉం టుంది. ఇప్పటికే, లావాదేవీలను ఉచితంగా అందిస్తున్న కొన్ని డిజిటల్ పేమెంట్ల యాప్ లు.. వ్యాలెట్ లోడింగ్ చార్జీని కూడా భరించడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు.
రమేశ్ అనే వ్యక్తికి ఓ బ్యాంక్‌లో ఖాతా ఉందనుకొందాం. అతను ఏదైనా వ్యాలెట్‌ను వినియోగిస్తున్నాడని భావిద్దాం. ఓ ఫ్రిజ్‌ను కొనడానికి బ్యాంకు ఖాతా నుంచి వ్యాలెట్‌కు రూ.25,000ను రమేశ్ లోడ్ చేశాడు. అప్పుడు ఎన్పీసీఐ నిబంధనల ప్రకారం.. 0.15 శాతం మొత్తాన్ని లోడింగ్ రుసుముగా సదరు వ్యాలెట్ బ్యాంక్‌కు చెల్లించాలి. అప్పటికే వినియోగదారుడికి ఉచిత లావాదేవీని అందిస్తున్న ఆ వ్యాలెట్.. లోడింగ్ రుసుమును కూడా భరిస్తుందని అనుకోలేమని, దీంతో ఆ భారాన్ని కస్టమర్‌కు బదిలీ చేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు రమేశ్ పీపీఐ ద్వారా ఫ్రిజ్ చెల్లింపును పూర్తిచేస్తే, 1.1 శాతం ఫీజు పడుతుందని గుర్తుచేస్తున్నారు. మొత్తానికి బ్యాంక్‌లు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల ఆదాయాన్ని పెంచడానికే ఎన్పీసీఐ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్టు వారు విశ్లేషిస్తున్నారు.
బ్యాంకు ఖాతా నుంచి మరో ఖాతాకు మాత్రమే కాకుండా మొబైల్ రీచార్జీ, కరెంటు, గ్యాస్ బిల్, ఇంటి అద్దె, డీటీహెచ్ పేమెంట్, ట్రావెల్ టికెట్ బుకింగ్స్ వంటి తదితర చెల్లింపులకు కోట్లాది మంది పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లను వినియోగిస్తున్నారు. అయితే, ఇప్పటివరకూ ఈ లావాదేవీలను ఉచితంగా అందించిన ప్రొవైడర్లు సేవా రుసుము పేరిట వసూళ్లను మొదలెట్టాయి. ఫోన్‌పే వంటి ప్రొవైడర్లు చెల్లింపుల కోసం 1 శాతానికిపైగా చార్జీలు వసూలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Capture