ఖమ్మం కమాన్‌బజార్/ కొత్తగూడెం గణేష్టెంపుల్, నవంబర్ 24: ఎన్నికల హామీలతోపాటు ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారు. భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆ పార్టీ నేతలు కెచ్చల రంగారెడ్డి, గుమ్మడి నర్సయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, పుల్లయ్య మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పత్తి పంటను సీసీఐ అధికారులు కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు రూ.2,500, రైతు రుణాల రద్దు, ఆటో కార్మికులు, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున జీవన భృతి, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని అందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాకు టీజేఎస్ నేతలు మద్దతు ప్రకటించారు. ఆయా కార్యక్రమాల్లో ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు.