స్వదేశంలో భారత జట్టుకు మరో ఘోర పరాభవం తప్పేలా లేదు! గెలిచే అవకాశమున్న ఈడెన్‌గార్డెన్స్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో ఓడిన టీమ్ఇండియా.. రెండో టెస్టులోనూ అదే బాటలో పయనిస్తున్నది. ప్రత్యర్థి బ్యాటర్లు భారీ స్కోర్లు చేసిన చోట.. తొలి ఇన్నింగ్స్‌లో కనీస ప్రతిఘటన లేకుండానే చేతులెత్తేసింది. దీంతో భారీ ఆధిక్యాన్ని దక్కించుకున్న సఫారీలు.. మ్యాచ్‌పై పూర్తిస్థాయిలో పట్టు బిగించారు. మరో రెండ్రోజులు మిగిలున్న ఈ టెస్టులో గెలుపు సంగతి దేవుడెరుగు! కానీ కనీసం డ్రాతో అయినా ముగించాలంటే నాలుగో రోజు దక్షిణాఫ్రికాకు వీలైనంత త్వరగా కళ్లెం వేసి బ్యాటింగ్‌లో గట్టిగా పోరాడితేనే పరువైనా దక్కుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గెలిస్తే మాత్రం మెన్ ఇన్ బ్లూ అద్భుతం చేసినట్టే!
గువహటి: మొదటి రెండు రోజులు బంతితో నిరాశపరిచిన భారత జట్టు.. మూడోరోజు బ్యాట్‌తోనూ తేలిపోయి మరోసారి దారుణ ప్రదర్శన చేసింది. ప్రత్యర్థి జట్టులో లోయరార్డర్ బ్యాటర్లు సైతం పరుగుల వరద పారించిన పిచ్‌పై మన స్టార్ ఆటగాళ్లు పట్టుమని పది నిమిషాలు క్రీజులో నిలిచేందుకు తంటాలు పడ్డారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా.. 201 పరుగులకే కుప్పకూలి సఫారీలకు ఏకంగా 288 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సమర్పించింది. యశస్వీ జైస్వాల్ (58) అర్ధశతకంతో రాణించగా వాషింగ్టన్ సుందర్ (48) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లు వికెట్ల కోసం చెమటోడ్చిన చోట సౌతాఫ్రికా పేసర్ మార్కో యాన్సెన్ (6/48) నిప్పులు చెరిగాడు. హర్మర్ (3/64) కీలక వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్‌ను ఫాలో ఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన బవుమా సేన.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 26 రన్స్ చేసింది. మొత్తంగా ఆ జట్టు ఆధిక్యం 314 పరుగులుగా ఉంది. రికెల్టన్ (13*), మార్క్మ్ (12*) క్రీజులో ఉన్నారు.
మూడో రోజు ఉదయం సెషన్లో భారత ఓపెనర్లు నిలకడగానే ఆడారు. స్పిన్నర్ల బౌలింగ్‌లో రాహుల్ కాస్త ఇబ్బందిపడ్డా జైస్వాల్ మాత్రం స్వేచ్ఛగానే బ్యాటింగ్ చేశాడు. మల్డర్ బౌలింగ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు కొట్టిన అతడు.. హర్మర్ ఓవర్లో సిక్స్ బాదాడు. మహారాజ్ వేసిన 22వ ఓవర్లో రెండో బంతిని రాహుల్ డిఫెండ్ చేయబోగా అది కాస్తా బ్యాట్‌కు తాకి స్లిప్స్‌లో మార్క్మ్ చేతిలో పడటంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కొద్దిసేపటి తర్వాత జైస్వాల్.. 85 బంతుల్లో సౌతాఫ్రికాపై తన తొలి హాఫ్ సెంచరీని నమోదుచేశాడు.
జైస్వాల్ అర్ధ శతకం తర్వాత భారత్ పెవిలియన్‌కు క్యూ కట్టింది. ఒకదశలో 94/1తో పటిష్టంగానే కనిపించిన ఆతిథ్య జట్టు.. 28 పరుగుల వ్యవధిలో ఏకంగా 6 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి టెస్టు హీరో హర్మర్.. వరుస ఓవర్లలో భారత్‌ను దెబ్బకొట్టాడు. 33వ ఓవర్లో జైస్వాల్‌ను ఔట్ చేసిన అతడు.. మరుసటి ఓవర్లో సాయి సుదర్శన్ (15)నూ వెనక్కి పంపాడు. ఆ తర్వాత యాన్సెన్ దెబ్బకు మిడిలార్డర్ కుదేలైంది. టీ విరామానికి ముందు ఓవర్లో అతడు.. జురెల్‌ను డకౌట్ చేశాడు. టీ తర్వాత రెండో ఓవర్లో తాత్కాలిక సారథి రిషభ్ పంత్ (7) సైతం యాన్సెన్ ఓవర్లోనే కీపర్ వెరీన్కు క్యాచ్ ఇచ్చాడు. నితీశ్ కుమార్ రెడ్డి (10) క్యాచ్‌ను గల్లీలో మార్క్మ్ కళ్లు చెదిరే రీతిలో అందుకున్నాడు. జడేజా (6) కూడా యాన్సెన్ బౌలింగ్‌లోనే మార్క్మ్ చేతికే చిక్కడంతో భారత్ 123/7తో నిలిచింది.
సఫారీ బౌలర్ల జోరు చూస్తే భారత్ 150 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ వాషింగ్టన్, కుల్దీప్ పోరాడారు. ఈ జోడీ దక్షిణాఫ్రికా బౌలర్లను సుమారు 35 ఓవర్ల పాటు నిలువరించింది. ఒక్కో పరుగు కూడదీసుకుంటూ ఆడి పరువు కాపాడే యత్నం చేసింది. కుల్దీప్ ఏకంగా 134 బంతులెదుర్కోవడం విశేషం. అయితే లంచ్ విరామం తర్వాత కొద్దిసేపటికి హర్మర్.. వాషింగ్టన్‌ను ఔట్ చేయడంతో 78 పరుగుల 8వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కుల్దీప్ను యాన్సెన్ బోల్తా కొట్టించగా బుమ్రా సైతం అతడినే అనుసరించడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది.
దక్షిణాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్: 489;
భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్: 83.5 ఓవర్లలో 201 ఆలౌట్ (జైస్వాల్ 58, సుందర్ 48, యాన్సెన్ 6/48, హర్మర్ 3/64);
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 8 ఓవర్లలో 26/0 (రికెల్టన్ 13*, మార్క్మ్ 12*)