న్యూఢిల్లీ, జూన్ 16: ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలకు సంబంధించి ఎలాంటి సేవలనైనా అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారానే పొందాలని తమ సభ్యులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) సోమవారం సూచించింది. థర్డ్-పార్టీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది. ఇప్పటికే యూజర్-ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తున్నామని, పారదర్శక, వేగవంతమైన సర్వీసులు అందేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా ఓ ప్రకటనలో తెలిపింది.
ఈపీఎఫ్‌వోలో ప్రస్తుతం 7 కోట్లకుపైగా ఖాతాదారులున్నారు. అయితే వీరి దగ్గర్నుంచి కొందరు సైబర్ కేఫ్ ఆపరేటర్లు, కొన్ని ఫిన్‌టెక్ సంస్థలు.. ఆయా సేవలకు నగదు తీసుకుంటున్నారని ఈపీఎఫ్‌వో చెప్తున్నది. నిజానికి ఆ సర్వీసులు ఆన్లైన్లో ఉచితమేనని గుర్తుచేసింది.