EPS | అధిక పెన్షన్ పొందేందుకు ఆస్కారమున్న ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)కు దరఖాస్తు చేసేందుకు ఆఖరు తేదీ ఈ నెల 11. నిజానికి ఇప్పటికే రెండుసార్లు ఈ తేదీని పొడిగించిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఇటీవల మరోమారు వాయిదా వేసింది. ఇప్పుడు కూడా ఈపీఎస్‌కు దరఖాస్తు చేయకపోతే అధిక పెన్షన్‌కు మార్గం దాదాపుగా మూసుకుపోయినట్టేననుకోవచ్చు.
ఈపీఎఫ్ స్కీమ్ నిబంధనలకు అనుగుణంగా నిర్దిష్ట పరిమితిని మించి వాస్తవ బేసిక్ వేతనంపై ఈపీఎఫ్ చెల్లించిన, చెల్లిస్తున్న కొంతమంది ఉద్యోగులకు మాత్రమే అధిక పెన్షన్ వర్తిస్తుంది. ఇందుకోసం గత ఏడాది నవంబర్ 4 సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎలిజిబులిటీని ఖరారు చేశారు. ఉద్యోగులు ఎలా అధిక పెన్షన్ పొందే ఆస్కారం ఉంది అనే అంశంపై ఈపీఎఫ్‌వో ఇప్పటికే అనేక సర్క్యులర్లు జారీ చేసింది. అలాగే తమ సభ్యుల ప్రయోజనార్థం ఒక ఆన్లైన్ లింకునూ రూపొందించింది. మెంబర్ సేవా పోర్టల్ ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు తమ ఎలిజిబులిటీని చెక్ చేసుకోవడంతోపాటు అప్లికేషన్లు సమర్పించవచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ సమర్పణ సమయంలో డాక్యుమెంట్లన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని పోర్టల్ పదేపదే సూచిస్తోంది.
యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్), ఈపీఎఫ్‌కు చెల్లిస్తున్నట్టు పేమెంట్ ఆర్డర్ రెఫరెన్స్ నెంబర్, పెన్షనర్లయితే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ వంటివి అవసరం. వీటికితోడు కొన్ని నిబంధనలను, పత్రాలను సరళీకరించింది ఈపీఎఫ్‌వో. వేజ్ సీలింగ్ లిమిట్‌ను దాటి బేసిక్ సాలరీ ఉన్న పరిస్థితుల్లో అధిక పెన్షన్ వచ్చే ఈపీఎస్‌లోకి మారాలనుకున్నపుడు జాయింట్ డిక్లరేషన్ సమర్పిస్తే సరిపోతుంది. ఇలా సమర్పించిన జాయింట్ అప్లికేషన్లను 20రోజుల్లోపు నిర్ధారించాలని ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలు జారీ చేసింది ఈపీఎఫ్‌వో. ఈపీఎస్ అకౌంట్ కొత్త స్కీమ్ కింద చేరాలనుకునేవాళ్లు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం వారి కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉండాలి. ఇలా ఉన్నవారు అధిక పెన్షన్ పొందేందుకు ఇదే ఆఖరి అవకాశంగా భావించాల్సి ఉంటుంది.
అలాగే సంస్థలు కూడా అందుకు అనుగుణంగానే అధిక చెల్లింపులు చేసి ఉండాలి. వీరంతా మాత్రమే ఈపీఎస్ అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే సెప్టెంబర్ 2014 తర్వాత ఈపీఎఫ్, ఈపీఎస్ స్కీమ్‌లో చేరినవాళ్లకు ఇది వర్తించబోదు. అంతకుముందు ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లే ఇందుకు అర్హత ఉన్నవాళ్లు.
– నాగేంద్రసాయి కుందవరం