దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం లాభనష్టాల్లో కదలాడాయి. తొలి రెండు రోజులు నష్టాల్లో కదలాడిన సూచీలు.. చివరి రెండు రోజులు లాభాలను అందుకున్నాయి. ఆఖరిరోజు శుక్రవారం భారీగా పెరిగాయి. దీంతో నష్టాల ముప్పు తప్పింది. మదుపరులలో కొనుగోళ్ల జోష్ కనిపించింది. దీంతో ఓవరాల్‌గా గత వారం మార్కెట్లు లాభాలనే సంతరించుకున్నాయి.
ఫలితంగా అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 730.93 పాయింట్లు లేదా 0.91 శాతం ఎగిసి 80,436.84 వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 173.65 పాయింట్లు లేదా 0.71 శాతం ఎగబాకి 24,541.15 దగ్గర నిలిచింది.
ఈ నేపథ్యంలో ఈ వారం కూడా ఒడిదొడుకులకు ఎక్కువగా ఆస్కారం కనిపిస్తున్నది. దేశ, విదేశీ పరిణామాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మదుపరులు లాభాల స్వీకరణ దిశగా నడిచే వీలు లేకపోలేదనిపిస్తున్నది. ఇక గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఈ వారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును నిర్దేశించనున్నాయి.
కాగా, అమ్మకాల ఒత్తిడి ఎదురైతే నిఫ్టీకి 24,100 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,900 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 24,800-25,100 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.