ముంబై, అక్టోబర్ 28: దేశీయ స్టాక్ మార్కెట్ల వరున నష్టాలకు బ్రేక్‌పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు దేశీయ మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో వరుసగా ఐదు రోజులుగా నష్టాల్లో కదలాడిన సూచీలు తిరిగి లాభాల్లోకి రాగలిగాయి. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 602.75 పాయింట్ల లాభంతో తిరిగి 80 వేల మైలురాయిని అధిగమించింది.
మార్కెట్ ముగిసే సమయానికి 80,005 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ సైతం 158.35 పాయింట్లు అందుకొని 24,338.15 వద్దకు చేరుకున్నది. క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గడంతో మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఫలితంగా కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో దీపావళి కంటే ముందుగానే బ్లూచిప్ సంస్థల షేర్లు రాకెట్లా పేలాయి. దీంతో గత ఐదు రోజులుగా నష్టాలే చవిచూస్తున్న దేశీయ మదుపరులకు లాభాల రుచి తగిలింది. సోమవారం రూ.4 లక్షల కోట్లకు పైగా సంపదను పెంచుకున్నారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ విలువ రూ.4,21,138.2 కోట్లు పెరిగి రూ.4,41,20,059.86 కోట్లు(5.25 ట్రిలియన్ డాలర్లు)గా నమోదైంది.