న్యూఢిల్లీ, డిసెంబర్ 15: దేశీయ మార్కెట్లో బంగారం ధర మళ్లీ ఆల్టైమ్ గరిష్ఠానికి చేరింది. సోమవారం ఒక్కరోజే ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పుత్తడి 10 గ్రాముల విలువ రూ.4,000 పుంజుకున్నది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా తులం రూ.1,37,600కు చేరింది. ఫలితంగా ఈ ఏడాది అక్టోబర్ 17న నమోదైన రూ.1,34,800 రికార్డు కనుమరుగైపోయినైట్టెంది. ఇదిలావుంటే హైదరాబాద్లో రూ.1,470 పెరిగి రూ.1,35,380 పలికింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం రూ.1,350 అందుకుని రూ.1,24,100గా ఉన్నది. కాగా, వెండి ధర శుక్రవారం ముగింపు స్థాయిలోనే యథాతథంగా ఉన్నది.
ఆల్టైమ్ హైలోనే కిలో రూ.1,99,500 వద్దే ట్రేడైంది. ఇక ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా పసిడి ధర రూ.58,650 (74.30 శాతం) పెరిగింది. వెండి రేటు రూ.1,09,800 (122.41 శాతం) పుంజుకున్నది. గత ఏడాది డిసెంబర్ 31న బంగారం ధర రూ.78,950గా, వెండి విలువ రూ.89,700గా ఉన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ వాల్యూ అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. ఔన్స్ 4,350.06 డాలర్ల వద్ద ముగిసింది. గత 5 రోజుల్లో 159.32 డాలర్లు లేదా 3.80 శాతం ఎగబాకింది. సిల్వర్ ఔన్స్ 63.96 డాలర్లుగా ఉన్నది. గత ట్రేడింగ్ సెషన్తో పోల్చితే 2 డాలర్లు పెరిగింది.