న్యూఢిల్లీ, డిసెంబర్ 10: రూపాయి మారకం విలువ పతనం.. దేశంలోకి దిగుమతయ్యే ప్రతిదాన్నీ ప్రభావితం చేస్తున్నది. భారతీయ దిగుమతుల్లో అధిక వాటా ముడి చమురుదే. ఆ తర్వాత బంగారం, వెండి, ఎలక్ట్రానిక్స్ వంటివి ఉన్నాయి. నిజానికి అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం వీటి ధరలు తగ్గుముఖం పడుతున్నా.. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ క్షీణత కారణంగా ఆ లాభం దక్కకుండా పోతున్నది. మునుపెన్నడూ లేనివిధంగా ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో ఈమధ్య రూపీ వాల్యూ 90 మార్కును దాటి పడిపోయిన విషయం తెలిసిందే.
ఇటీవల కాస్త బలపడినా ఇంకా ఆ దరిదాపుల్లోనే కదలాడుతున్నది. ఈ నేపథ్యంలో వాణిజ్య లోటు అంతకంతకూ పెరిగిపోతున్నది. ఈ ఏడాది అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో 41.68 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అయినప్పటికీ అటు ఆర్బీఐగానీ, ఇటు కేంద్ర ప్రభుత్వంగానీ పెద్దగా పట్టించుకోవట్లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ చర్యలు ప్రభావవంతంగా ఉండట్లేదన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నడుమ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. స్టాక్ మార్కెట్ల నష్టాలు మదుపరులను గోల్డ్-సిల్వర్ కొనుగోళ్ల వైపునకు నడిపిస్తున్నాయి. భారత్ సహా ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులూ బంగారం, వెండి నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దిగజారుతున్న రూపాయి మారకం విలువ.. గ్లోబల్ మార్కెట్లో ధరల తగ్గుదల ప్రయోజనాన్ని దూరం చేస్తున్నది. ప్రస్తుతం ఔన్స్ బంగారం అంతర్జాతీయంగా 4,200 డాలర్లు పలుకుతున్నది. అయినప్పటికీ డాలర్‌తో చూస్తే రూపాయి విలువ పతనం దెబ్బకు గత రికార్డు స్థాయి రేట్లకే బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. దీంతో దేశంలో డాలర్ నిల్వలు కరిగిపోవడమేగాక, వాణిజ్య లోటు పెరుగుతున్నది.
గత ఆర్థిక సంవత్సరం (2024-25) దేశంలోని యాపిల్, సామ్సంగ్, ఎల్జీ, హాయర్, లెనోవో, వర్ల్‌పూల్, మోటోరోలా తదితర దాదాపు డజను సంస్థలు రూ.1.21 లక్షల కోట్లకుపైగా విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2023-24)తో పోల్చితే ఇవి 13 శాతం అధికం. రూపాయి నష్టాలతో ఈ విలువ ఇంకాఇంకా పెరుగుతూపోతున్నదని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’తో ఆయా వస్తువుల దిగుమతులు తగ్గినా.. వాటి తయారీకి వినియోగించే విడిభాగాల దిగుమతులు మాత్రం అలాగే ఉన్నాయి మరి. సెమికండక్టర్ చిప్‌లు, డిస్ప్లే ప్యానెళ్లు, కెమెరా సెన్సార్లు, ఏసీ కంప్రెషర్లను దిగుమతి చేసుకోవాల్సిందే. ఈ క్రమంలోనే ఎల్జీ, లెనోవో దిగుమతుల్లో ఎలాంటి తగ్గుదల లేదని అంటున్నారు. ఇక వోల్టాస్ దిగుమతులైతే గతంతో పోల్చితే 9 శాతం నుంచి 15 శాతానికి పెరిగాయని ఇండస్ట్రీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
బ్యారెల్-డాలర్ దెబ్బ
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితే.. ప్రతి బ్యారల్కూ మరిన్ని డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ పడిపోతే.. ప్రతి డాలర్‌కూ మరిన్ని రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ రేట్లు పెరుగుతున్నప్పుడు, దేశీయ మార్కెట్లో డాలర్లకూ డిమాండ్ ఏర్పడితే ఆర్థికవేత్తలు దాన్ని ‘డబుల్ ఇంపాక్ట్’గా అభివర్ణిస్తారు. ఎన్నోసార్లు ఈ ప్రభావం భారత్‌పై కనిపించింది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు ధరల్లో పెరుగుదల లేనప్పటికీ.. దేశీయంగా డాలర్లకున్న డిమాండ్‌తో దిగుమతయ్యే ముడి చమురుకు మరింతగా చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది.
దేశ ఇంధన అవసరాల్లో 85 శాతానికిపైగా దిగుమతుల ద్వారానే తీరుతున్న విషయం తెలిసిందే. నిజానికి ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 63-64 డాలర్లే. కానీ రూపాయి విలువ పతనంతో సదరు చమురుకు దిగుమతి అయినప్పుడు ఎక్కువ చెల్లించాల్సి వస్తున్నది. ఫలితంగా వస్తూత్పత్తిపరంగా వాణిజ్య లోటు ఎగబాకుతున్నది. మొత్తానికి ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠాలలో కదలాడుతుండటంతో సమీప భవిష్యత్తులో దేశ వాణిజ్య లోటు దిగిరాకపోవచ్చన్న అంచనాలే ఉన్నాయి.
రూపాయి మారకం విలువ పతనం వెనుక దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెరిగిన డిమాండ్, స్టాక్ మార్కెట్ల నష్టాలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో ఆలస్యం వంటివి ప్రధానంగా ఉన్నాయని ఫారెక్స్ ట్రేడర్లు చెప్తున్నారు. అయితే ఈసారి ద్రవ్యసమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గిస్తే కొంత ఊరట దక్కుతుందన్న అంచనాలున్నాయి. అయినప్పటికీ ఒడిదుడుకులు తప్పవనే అంటుండటం గమనార్హం. భారత్ నుంచి తరలిపోతున్న విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడులు కూడా ఇందుకు కారణమని వారంటున్నారు. ఏది ఏమైనా రూపాయి విలువ పెరుగకపోతే ద్రవ్యోల్బణం ముప్పు పొంచి ఉన్నదని, ఆ ప్రమాదమే సంభవిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఆగమాగమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారిప్పుడు.