న్యూఢిల్లీ, ఆగస్టు 16: జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయం సామాన్యులకు సైతం భారీ ఊరట లభించబోతున్నది. ఈ నిర్ణయంతో పలు రకాల ఉత్పత్తుల ధరలు తగ్గనుండటంతోపాటు బీమా పాలసీల ధరలు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్న నరేంద్ర మోదీ సర్కార్..దీనిని 5 శాతానికి కుదించేయోచనలో ఉన్నది. దీంతో ఈ రెండు రకాల పాలసీలు తీసుకున్నవారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగడంతోపాటు బీమా ప్రీమియం చెల్లింపులు తగ్గనున్నాయి.
బీమా ప్రీమియంలపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించాలని బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి సూచించిన విషయం తెలిసిందే. 2047 నాటికి భారతీయులందరికి బీమా ఉండాలనే నినాదంతో ముందుకుసాగుతున్న ఐఆర్డీఏఐ..ఈ జీఎస్టీ తగ్గింపు కొంతలో కొంత మేలు చేయనున్నది. బీమా ప్రీమియంపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని సూచించింది.
బీమా పరిధిని మరింత విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు చేస్తున్న ప్రయోజనాలు బెడిసికొడుతున్నాయి. గతంలో నాలుగు శాతంగా ఉన్న బీమా వినిమయం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3.7 శాతానికి పరిమితమైంది. దీంట్లో నాన్-లైఫ్ వినిమయం ఒక్క శాతంగా ఉండగా, లైఫ్ ఇన్సూరెన్స్‌లు 3 శాతంగా నమోదయ్యాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.2, 101 కోట్ల జీఎస్టీని వసూలు చేసిన బీమా సంస్థలు..2023-24 నాటికి రూ.16,398 కోట్ల ఆదాయాన్ని వసూలు చేశాయి.