GST | న్యూఢిల్లీ, మార్చి 10: జీఎస్టీ ఎగవేతలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్యకాలంలో 25,397 జీఎస్టీ ఎగవేతలకు పాల్పడగా, వీటి విలువ రూ.1.95 లక్షల కోట్లుగా ఉన్నదని లోకసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన ఐదేండ్లలో జీఎస్టీ ఎగవేతలకు సంబంధించి 86,711 కేసులు నమోదుకాగా, వీటి విలువ రూ.6.79 లక్షల కోట్లుగావున్నదని పేర్కొంది.
ఇదే క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి చివరినాటికి 25,397 జీఎస్టీ ఎగవేతలకు సంబంధించి కేసులు నమోదుకాగా, వీటి విలువ రూ.1,94,938 కోట్లుగా ఉంది. అలాగే ఆదాయ పన్నుకు సంబంధించి 13 వేల కేసులు నమోదుకాగా, వీటి విలువ రూ.46,472 కోట్లు. పన్ను ఎగవేతకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.
ఆర్థిక సంవత్సరం ఎగవేత
2020-21 49,384 కోట్లు
2021-22 73,238 కోట్లు
2022-23 1.32 లక్షల కోట్లు
2023-24 2.30 లక్షల కోట్లు
2024-25(జనవరి వరకు) 1.95 లక్షల కోట్లు