Tesla | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో వైరం నేపథ్యంలో టెస్లా షేర్లు 8శాతం వరకు నష్టపోయాయి. ట్రంప్‌తో వివాదం నేపథ్యంలో కొత్తగా ‘ది అమెరికన్ పార్టీ’ని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మస్క్ తీసుకున్న నిర్ణయం పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేసింది. ఈ క్రమంలో ఒక్క రోజులోనే టెస్లా మార్కెట్ విలువ నుంచి రూ.1.4 బిలియన్లకుపైగా సంపద తుడిచి పెట్టుకుపోయింది. టెస్లా షేరు ధర 315. 35కి తగ్గింది. గతేడాది డిసెంబర్లో టెస్లా షేర్ 488 డాలర్లతో గరిష్టంతో పోలిస్తే చాలా తక్కువ. కేవలం ఆరు నెలల్లోనే 35శాతం తతగ్గింది. వరుసగా డెలివరీలు తగ్గుతున్న నేపథ్యంలో మస్క్ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాడా? టెస్లాపై దృష్టి పెట్టడం లేదా? అంటూ పెట్టుబడిదారులు ప్రశ్నిస్తున్నారు.
అయితే, ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించడంతో టెస్లా షేరు ధర భారీగా పడిపోయింది. మస్క్ అమెరికన్ పార్టీ ప్రకటన పెట్టుబడిదారులను కలవరానికి గురి చేస్తున్నది. ముఖ్యంగా కంపెనీ అమ్మకాలు పడిపోతున్నాయి. ఈ సమయంలోనే ఎలాన్ మస్క్ 2026 మధ్యంతర ఎన్నికలు, 2028 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్స్, రిపబ్లికన్లు ఇద్దరినీ సవాల్ చేసే లక్ష్యంతో కొత్త రాజకీయ వేదికగా ‘అమెరికా పార్టీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆకస్మిక నిర్ణయం వాల్‌స్ట్రీట్‌కు ఏమాత్రం రుచించలేదు. రాజకీయరంగ ప్రవేశం టెస్లా వ్యాపారం నుంచి ఆయన దృష్టి మళ్లించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటుండగా.. పెట్టుబడిదారులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే మస్క్ తనను తాను చాలా బలహీనంగా మార్చుకుంటున్నాడని పెట్టుబడిదారులు ఆందోళనకు గురవుతున్నట్లుగా సాక్సో మార్కెట్స్ విశ్లేషకులు పేర్కొన్నారు. టెస్లా ఇప్పటికే వరుసగా రెండు త్రైమాసికాల్లో డెలివరీ లక్ష్యాలను సాధించలేకపోయింది. ఇప్పుడు మస్క్ రాజకీయ రంగ ప్రవేశంతో టెస్లా భవిష్యత్ వృద్ధిపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.
టెస్కా కంపెనీ మార్కెట్ కాపిటలైజేషన్ ఈ ఏడాది జులై 4వ తేదీ నాటికి 1.01 ట్రిలియన్ డాలర్లుగా మాక్రో ట్రెండ్స్ అంచనా వేసింది. సోమవారం నాటికి (జులై 7) మార్కెట్ క్యాప్ 946.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఈ ఏడాది నేటి వరకు టెస్లా 22శాతం తగ్గింది. టెస్లా షేర్లు డిసెంబర్ 18, 2024 రోజున ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో 488.54 డాలర్లకు చేరింది. అప్పటి నుంచి దాదాపు 40శాతం తగ్గింది. ప్రస్తుతం 292.04 డాలర్లకు తగ్గింది. మస్క్ రాజకీయ పార్టీ కారణంగా టెస్లా వ్యాపారంపై భారీగా ప్రభావం పడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2024 డిసెంబర్లో డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికైన తర్వాత టెస్లా స్టాక్ గరిష్ట స్థాయి నుంచి 35శాతం పడిపోయింది. ఈవీలకు విధానపరమైన మద్దతు ఆశలు ర్యాలీకి ఆజ్యం పోశాయి.
అయితే, ట్రంప్ ప్రస్తుతం ఈవీ సబ్సిడీలు తగ్గిస్తానని చెప్పడం, రాజకీయంగా బహిరంగంగానే ఘర్షణకు దిగడం టెస్లా ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ప్రపంచ ఈవీ అమ్మకాల్లో టెస్లా ముందంజలో ఉన్నప్పటికీ రాజకీయ వివాదం మరింత ముదిరితే స్టాక్స్ మరింత ఒత్తిడిల ఉండవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 23న కంపెనీ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు ఆదాయ నివేదిక కోసం నిశితంగా పరిశీలిస్తున్నారు. దాంతో టెస్లా వ్యాపారం ఎలా సాగుతుందో తెలియనున్నది. అప్పటి వరకు, సబ్సిడీలు, డెలివరీలు, మస్క్ రాజకీయ భవిష్యత్తు చుట్టూ ఉన్న అనిశ్చితి స్టాక్‌పై ఒత్తిడి కొనసాగనున్నది. టెస్లా డెలివరీస్ అంచనాలు తప్పినా.. రాజకీయ ఉద్రిక్తతలు అంచనాలను పెరిగితే స్టాక్ మరింత అల్లకల్లోలానికి గురయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.