Telsa In India : ఎలక్ట్రానిక్ కార్ల తయారీలో దిగ్గజంగా పేరొందిన టెస్లా (Telsa) కంపెనీ భారత్‌లో అడుగుపెట్టనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూం ప్రారంభించేందుకు టెస్లా యాజమాన్యం సిద్ధమవుతోంది. జూన్‌లో ముంబై కేంద్రంగా ‘మోడల్ వై రేర్ వీల్ డ్రైవ్ ఎస్యూవీ’ కార్లను అమ్మేందుకు సన్నాహకాలు చేస్తోంది. డిమాండ్‌ను బట్టి ఆ తర్వాత ఢిల్లీలోనూ షో రూం ఏర్పాటు చేయాలనే ప్రణాళికతో టెస్లా ఉందని న్యూయార్క్‌లోని బ్లూమ్బర్గ (Bloomberg) వార్తా కథనం పేర్కొంది.
ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఫిబ్రవరిలో అమెరికా పర్యటన సమయంలోనే భారత్‌లో టెస్లా విస్తరణకు బీజం పడిందని సదరు మీడియా సంస్థ తెలిపింది. ఆటోమొబైల్ రంగంలో కొత్త ఒరవడి సృష్టించిన టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌కు ఈసారి భారత్‌ను ఎంచుకుంది. యూరప్, చైనాలో అమ్మకాలు పడిపోవడంతో ఇండియాలో సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో ఉంది ఎలాన్ మస్క్ చెందిన ఈ సంస్థ.
అందులో భాగంగానే ముంబైలో తమ తొలి షోరూం ప్రారంభించడానికి టెస్లా ఏర్పాట్లు చకచకా చేస్తోంది. వచ్చే నెలలో అమ్మకాలకు సర్వం సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే చైనా, అమెరికాల నుంచి సూపర్ చార్జర్లు, కార్ యాక్సెసరీస్, ఇతర విడిభాగాలను పెద్ద సంఖ్యలో దిగుమతి చేసుకుందని బ్లూమ్‌బర్గ్ తమ కథనంలో వెల్లడించింది. అంతేకాదు మోడల్ వై రీర్ వీల్ డ్రైవ్ ఎస్‌యూవీలను చైనాలోని షాంఘైలో ఉన్న తమ ఫ్యాక్టరీ నుంచి భారత్‌కు తీసుకువచ్చింది టెస్లా. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన వై మోడల్ కారు ధర పన్నులు, బీమా కలిపితే రూ. 48 లక్షలపైనే ఉండనుంది.