హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా తలవంచబోమని, నిలదీస్తూనే ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్పష్టంచేశారు. రేవంత్ రెడ్డి బినామీల ద్వారా నడిపిస్తున్న క్వారీ పనులను ప్రశ్నించినందుకే తనను అరెస్ట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేస్తున్న సందర్భంగా కౌశిక్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.
ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎయిర్‌పోర్టులోనే తనను అరెస్టు చేయడం అక్రమమని కౌశిక్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నిజాయితీ తలవంచదని అన్నారు. శంషాబాద్‌లో తనను అరెస్ట్ చేసిన తీరు ప్రజాస్వామ్యంపై దాడికి సమానమని వ్యాఖ్యానించారు.
‘రేవంత్ రెడ్డి గారూ.. మీ కుట్రలు, అక్రమ కేసులతో నన్ను ఆపాలని అనుకోవడం మీ మూర్ఖత్వాన్ని, మీ అసమర్థ పాలనను, అక్రమ రాజకీయాలను చాటుతోంది. ముమ్మాటికి తాను ప్రస్తావిస్తున్న క్వారీ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతోపాటు మంత్రి సీతక్క బినామీలది. దానివల్ల ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతున్నది. వారి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడింది. ఇచ్చిన భూమి పరిధి దాటి అక్రమంగా వారిని నడుపుతూ ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. ఆ ప్రాంత ప్రజల కోసం ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటా’ అని పాడి స్పష్టంచేశారు.