హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ): సెమీకండక్టర్ల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం వైష్ణవ్‌ను ఆయన కలిశారు. తెలంగాణలో సెమీకండక్టర్ల తయారీకి ముందుకొచ్చే పరిశ్రమలకు కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, ఇతర అంశాలను వివరించారు. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో ఈ రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఇక ఏఐ, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలనూ తెలియజేశారు. పలు ప్రముఖ సంస్థలు తెలంగాణలో తమ డాటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయని, ఇలాంటి తరుణంలో డాటా భద్రత కీలకంగా మారిందన్నారు.
అందుకే ‘నేషనల్ డిజాస్టర్ రికవరీ జోన్’ ఏర్పాటు చేయడం తప్పనిసరని, ఈ అంశంపై దృష్టి సారించాలని కోరారు. కాగా, వచ్చే నెల 24న హైదరాబాద్‌లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరు కావాలని కేంద్ర మంత్రి వైష్ణవ్‌ను శ్రీధర్ బాబు ఈ భేటీలో ఆహ్వానించారు.