PM Modi | హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్ష.. ప్రజా రవాణాను కూడా వదలట్లేదు. రాష్ట్రంలో కొత్తగా మరో మూడు ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అనుకూల నివేదికలు సమర్పించినా వాటిని అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం ముందుకు రావడం లేదు. ఈ మూడింట్లో వెంటనే విమానయాన కార్యకలాపాలు చేపట్టేందుకు సర్వం సిద్ధంగా ఉన్న వరంగల్ ఎయిర్‌పోర్టుపై సైతం నాన్చివేత ధోరణినే అవలంభిస్తున్నది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఏడు విమానాశ్రయాల్లో కమర్షియల్ ఆపరేషన్స్ కొనసాగుతుంటే, మన రాష్ట్రంలో మాత్రం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తప్ప మరో ఎయిర్‌పోర్టు అందుబాటులో లేకపోవడం గమనార్హం.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ప్రజల అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఆరు కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యంత్రి కే చంద్రశేఖర్ రావు ఎప్పుడో నిర్ణయించారు. ఇందులోభాగంగా నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్ జిల్లా దేవరకొండలో గ్రీన్‌ఫీల్డ్ (కొత్తగా ఏర్పాటు చేయడం) ఎయిర్‌పోర్టులు.. వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్నగర్తోపాటు ఆదిలాబాద్‌లో బ్రౌన్‌ఫీల్డ్ (ప్రస్తుతం ఉన్నవాటిని అభివృద్ధి చేయడం) ఎయిర్‌పోర్టుల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ క్రమంలో టెక్నో-ఎకనామిక్ ఫిజిబులిటీ స్టడీ (టీఈఎఫ్‌ఎస్), అబ్స్టాకిల్ లిమిటేషన్ సర్ఫేస్ (ఓఎల్ఎస్) సర్వే, సాయిల్ టెస్టింగ్సహా పలు ఇతర పరీక్షలను ఏఏఐ నిర్వహించి జక్రాన్‌పల్లి, ఆదిలాబాద్, వరంగల్‌లో ఎయిర్‌పోర్టులకు అనుకూల పరిస్థితులున్నట్టు గుర్తించింది. చిన్న విమానాల కోసం వీటిని ప్రారంభించాలని, ఇందుకోసం భూసేకరణ చేయాల్సిన అవసరం కూడా లేనందున.. వెంటనే ప్రారంభించుకోవచ్చని కూడా ఈ సందర్భంగా ఓ నివేదికలో ఏఏఐ సిఫారసు చేసింది. వీటిని రెండు దశల్లో అభివృద్ధి చేయవచ్చని, మొదటి దశలో ఏటీఆర్-72 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు, రెండో దశలో ఏబీ-320 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు సేవలు అందించవచ్చన్నది. కానీ ఏఏఐ, పౌర విమానయాన శాఖ అనుమతుల్లేక నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు.
ప్రస్తుతం ఆదిలాబాద్‌లో ఉన్నది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) ఆధీనంలోని ఎయిర్‌పోర్టు. అయితే స్థానికుల చిరకాల స్వప్నమైన ఎయిర్ ప్యాసింజర్ ఎయిర్‌పోర్టును ఇక్కడ అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. దీన్ని అభివృద్ధి చేసేందుకు మొదటి దశలో 122 ఎకరాలు, రెండో దశలో 175 ఎకరాల స్థలం అవసరమవుతుండటంతో భూములను కేటాయించేందుకూ ప్రభుత్వం సిద్ధమే. అలాగే దీనికి అవసరమైన అనుసంధానం రోడ్లను ఏర్పాటు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రం సమ్మతిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు, ముఖ్యంగా నిత్యం ప్రయాణాలు సాగించే అక్కడి వలస కార్మికులతోపాటు మహారాష్ట్రలోని శివారు ప్రాంతాలవారిని దృష్టిలో ఉంచుకొని జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ మోదీ సర్కారు మాత్రం ఎటూ తేల్చకుండా కాలయాపన చేస్తున్నది.
మూడేండ్ల క్రితం రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమై రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. అలాగే మామునూరు ఎయిర్‌పోర్టుకు భూమి అందుబాటులో ఉన్నందున ఇక్కడ త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన ఐదు ఎయిర్‌పోర్టుల ప్రారంభానికి కూడా తగిన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
రాష్ట్ర ప్రభుత్వం మామునూరు ఎయిర్‌పోర్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఈ క్రమంలోనే సాధ్యమైనంత త్వరగా దీన్ని ప్రారంభించేలా అవసరమైన చర్యలను వేగవంతం చేసింది. ఇందులోభాగంగా ఈ ఏడాది జూలై 31న జరిగిన క్యాబినెట్ సమావేశంలో 253 ఎకరాల అదనపు స్థలాన్ని ఉచితంగా ఏఏఐకి ఇవ్వాలని నిర్ణయించింది. సమీపంలోని వెటర్నరీ యూనివర్శిటీకి చెందిన 249 ఎకరాల స్థలం అందుబాటులో ఉండటంతో దాన్ని ఎయిర్‌పోర్ట్‌కు ఇచ్చి, యూనివర్శిటీ కోసం భూసేకరణ జరపాలని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ కూడా ఈ భూమిని ఏఏఐకి అప్పగించే ప్రక్రియ చేపట్టారు. దీంతోపాటు జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు సీఈవో నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్‌ను కోరుతూ గత నెల 10న జీఎమ్మార్‌కు ఓ లేఖను కూడా ప్రభుత్వం రాసింది. జీఎమ్మార్‌తో అప్పటి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 150 కిలోమీటర్ల పరిధిలో కొత్త ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయరాదు. మామునూరు ఎయిర్‌పోర్టు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 145 కిలోమీటర్ల ఏరియల్ దూరంలో ఉన్నది. దీంతో సర్టిఫికెట్ వస్తే మామునూరు ఎయిర్‌పోర్టుకు అడ్డంకులు తొలగిపోయే వీలుండగా, ముందడుగు వేయాలని ఆగస్టు 11న ఏఏఐ చైర్మన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖనూ రాసింది.