హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : భవిష్యత్తు ఏరోస్పేస్ రంగ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను దేశానికి ఒక వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆర్అండ్ డీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, సర్టిఫికేషన్ అండ్ కాంప్లియెన్స్లను అనుసంధానించగలిగే దేశాలు, రాష్ట్రాలే రాబోయే రోజుల్లో ఏరోస్పేస్లో గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతాయన్నారు. ఆ దిశగానే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సవాళ్లు, మార్పులను అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఎకో సిస్టం’ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
శుక్రవారం ‘ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ హైదరాబాద్ శాఖ గచ్చిబౌలీలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ‘ఛేంజింగ్ సినారియో ఇన్ ఏరోస్పేస్: ఆర్ అండ్ డీ, మ్యాన్‌ఫ్యాక్చరింగ్ అండ్ సర్టిఫికేషన్’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
రాబోయే 20 ఏండ్లలో ప్రపంచవ్యాప్తంగా 42,000 కొత్త ఎయిర్ క్ట్రాఫ్ట్స్ అవసరం ఉంటుందని, ఆ డిమాండ్‌ను హైదరాబాద్ అందిపుచ్చుకునేలా ప్రిసిషన్ ఇంజినీరింగ్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నెట్వర్, బలమైన ఎంఎస్ఎంఈ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న 1,500కు పైగా ఎంఎస్ఎంఈలు ప్రపంచస్థాయి ఏరోస్పేస్ దిగ్గజ సంస్థలకు విడిభాగాలను సరఫరా చేస్తూ ‘మేడిన్ తెలంగాణ’ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నట్లు తెలిపారు.