హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్.. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఖర్చు ఏరోస్పేస్ గమ్యస్థానంగా ఎదిగిందని, రక్షణ రంగ పరిశోధనా సంస్థలు, అత్యాధునిక తయారీ యూనిట్లకు పేరుగాంచిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సాంకేతిక యుద్ధాలు, డ్రోన్ వ్యవస్థలు నేడు జాతీయ భద్రతలో కీలక శక్తులుగా మారాయని నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజరీ బోర్డు సభ్యుడు, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జీ సతీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ స్పార్క్ 3.0-ఏరోస్పేస్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ సదస్సు జరిగింది. ఇందులో 400లకుపైగా రక్షణ రంగ నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, ఎంఎస్ఎంఈ ప్రతినిధులు పాల్గొని దేశంలో అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, డిఫెన్స్, తయారీ రంగాల్లోగల అవకాశాలపై చర్చించారు.
ఈ సందర్భంగానే సదస్సుకు హాజరైన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. భారత వైమానిక దళంలో ఫైటర్ పైలెట్‌గా, రాష్ట్రపతికి ఏడీసీగా పనిచేసిన అనుభవాలను వివరించారు. ఈ క్రమంలోనే ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని చెప్పారు. 2030 నాటికి ఈ రంగాలలో అగ్రగామి కేంద్రంగా తెలంగాణ ఎదుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1,500 ఎంఎస్ఎంఈలు, ఏరోస్పేస్, డిఫెన్స్ వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్నాయని తెలిపారు. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ ద్వారా స్వదేశీ రక్షణ వ్యవస్థలు, ఆయుధాలు, సాంకేతిక శక్తిని ప్రపంచానికి భారత్ చాటిచెప్పిందన్నారు. డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ చంద్రిక కౌశిక్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ పూర్తి స్వదేశీ సాంకేతికతతో విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ అని తేల్చిచెప్పారు.