Hyderabad | Startup Telangana | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, వారిలోని నైపుణ్యాలను వెలికితీసి అవసరమైన తర్ఫీదునిస్తూ స్టార్టప్‌లను నెలకొల్పడానికి తెలంగాణ సర్కారు చేయూతనందిస్తున్నది. దీంతో దేశంలోనే తెలంగాణ.. స్టార్టప్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందిప్పుడు. రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో తీసుకుంటున్న పలు విధానపరమైన నిర్ణయాలు, చర్యలవల్ల త్వరలోనే భారతీయ ఐటీ హబ్ బెంగళూరును హైదరాబాద్ అధిగమిస్తుందని సోషల్ మీడియాలో ఓ లోతైన విశ్లేషణతో కూడిన వీడియో వైరల్ అవుతున్నది. భారత్ మ్యాటర్స్ అనే యూట్యూబ్ చానల్.. స్టార్టప్‌ల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, ఫండ్ రైజింగ్, మౌలిక సదుపాయాలు, టీ-హబ్, యువతకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు వంటి తెలంగాణ ప్రభుత్వ విధానాలపై విస్తృత విశ్లేషణతో కూడిన వీడియోను పోస్టు చేసింది.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ గణాంకాల ప్రకారం 2016లో మొత్తంగా దేశంలో 452 స్టార్టప్లుండగా.. 2022లో 84,012కు పెరిగాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్ స్టార్టప్‌లను ఆకర్షించడంలో వెనుకబడిపోయిందని, అందుకే బెంగళూరుకు లాభం జరిగిందని సదరు చానల్ చెప్పింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితి మారిందని తన విశ్లేషణలో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి సంప్రదాయ స్టార్టప్ కేంద్రాలను ఇప్పుడు హైదరాబాద్ వెనక్కి నెడుతోందని, త్వరలోనే తెలంగాణ రాష్ట్రం స్టార్టప్‌లకు అడ్డాగా మారుతుందన్న విశ్వాసాన్ని చానల్ వ్యక్తం చేసింది. ఇప్పటికే గ్లోబల్ కార్పొరేట్లు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌పై అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారని, 2014 నుంచి 2022 మధ్య హైదరాబాద్‌లో ప్రారంభించిన వివిధ స్టార్టప్‌లకు 2.5 బిలియన్ డాలర్ల నిధులు లభించాయని గుర్తుచేసింది. హైదరాబాద్‌లో సాస్, డార్విన్, డార్విన్ బాక్స్, జెనతి మొదలైన ప్రముఖ సాఫ్ట్వేర్ బేస్డ్ స్టార్టప్‌లు వచ్చాయని, తెలంగాణలో 6,660కిపైగా స్టార్టప్లున్నాయన్నది. దేశీయ ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న ప్రతీ మూడు ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణ నుంచేనని చెప్పింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 2016 నుంచి 2022 జూన్ వరకు తెలంగాణలో 44,649 ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.