హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు రెండు సంస్థలు ముందుకొచ్చాయి. రూ. 27 వేల కోట్లతో 5,600 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేందుకు ఎకోరేస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో రూ.2 వేల కోట్లతో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్ట్‌లను నెలకొల్పడానికి జీపీఆర్ఎస్ ఆర్య ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది.
ఈ మేరకు బుధవారం రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్డీలో టీజీ రెడ్కోతో ఈ రెండు సంస్థలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వరిగడ్డితో కంప్రెస్డ్ బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయడానికి జీపీఆర్ఎస్ ఆర్య సంస్థ ముందుకు రావడం పట్ల భట్టి విక్రమార్క అభినందించారు. దావోస్ పర్యటనలో తమ ప్రభుత్వం సన్‌పెట్రో కంపెనీ రూ.20 వేల కోట్లతో 3,400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నదన్నారు.