హైదరాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ) : జపాన్‌కు చెందిన టోహో కోకి సెయిసాకుషో సంస్థ.. రూ.8 కోట్ల వ్యయంతో భారత్‌లో తొలి సీఎంపీ ప్యాడ్ హబ్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి గురువారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో టోహో కోకి సెయిసాకుషో, టీ-వర్స్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. జపాన్ సెమీకండక్టర్ సాంకేతిక పరిజ్ఞానానికి తెలంగాణ ముఖద్వారంగా అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు.
కీలకమైన కెమికల్, మెకానికల్ పాలిషింగ్ టెక్నాలజీని స్థానికంగా అందుబాటులోకి తెచ్చేందుకు టోహో కోకి ముం దుకు రావడం, దేశంలోనే అతిపెద్ద ఫోటో టైపింగ్ కేంద్రం టీ-వర్స్ను భాగస్వామిగా ఎంపిక చేసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేసారు. జపనీస్ పరిశ్రమలు, అంకుర సంస్థలు, పరిశోధకుల కోసం టీ వర్స్ లో ప్రత్యేకంగా ఒక ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను నెలకొల్పనున్నట్టు శ్రీధర్ బాబు తెలిపారు. ప్రస్తుతం దేశంలో సీఎంపీ ప్యాడ్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలు లేకపోవడం వల్ల ఏటా రూ.100 కోట్ల విలువైన దిగుమతులు చేసుకుంటున్నారు.