హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు తలసరి ఆదాయాన్నే గీటురాయిగా తీసుకుంటారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి వేగానికి తలసరి ఆదాయ వృద్ధిరేటే ప్రధాన సూచికగా నిలుస్తుంది. అంతటి విశేష ప్రాధాన్యమున్న రాష్ర్టాల తలసరి ఆదాయ వృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్రంలోని మోదీ సర్కారు నయాపైసా ఇయ్యకున్నా స్వీయ శక్తితో తెలంగాణ ముందుకు సాగుతున్నది తెలిసిందే. అయినప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రం నలుదిక్కులకూ విస్తరిస్తూ తిరుగులేని ఆర్థిక శక్తిగా అవతరించింది.
2014-15 నుంచి తలసరి ఆదాయాన్ని ఏటేటా గణనీయంగా మెరుగుపర్చుకుంటున్న తెలంగాణ.. ఈ విషయంలో తనకు సాటిలేదని మరోసారి రుజువు చేసుకున్నది. ఈ ఆర్థిక సంవత్సరాని (2022-23)కిగాను దేశ తలసరి ఆదాయ గణాంకాల్లో తెలంగాణ ఏ రాష్ట్రానికీ అందనంత ఎత్తులో నిలిచింది. రాష్ట్ర తలసరి ఆదాయం.. దేశంలోని మిగతా రాష్ర్టాలకన్నా ఎక్కువగా ఉందని స్వయంగా కేంద్ర గణాంక, ప్రణాళికా, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ వెల్లడించారు.
లోక్సభలో తాజాగా ఎంపీలు పూనమ్ మహాజన్ కుమారి, రమ్యా హరిదాస్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం మధ్య రాష్ర్టాల తలసరి ఆదాయాన్ని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే 2017-18లో రూ.1,79,358గా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం.. 2022-23కు రూ.3,08,732కు పెరిగిందని ప్రకటించారు. నిజానికి రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్ల (2014-15)లో ఇది రూ.1,24,104 మాత్రమే. దీంతో నాటితో పోల్చితే 150 శాతానికి పైగా పెరిగినైట్టెంది. ఈ ఎనిమిదేండ్లలో రూ.1,84,628 ఎగిసింది.
ఈ వ్యవధిలో ఈ స్థాయిలో తలసరి ఆదాయాన్ని పెంచుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే కావడం విశేషం. తలసరి ఆదాయంలో జాతీయ వృద్ధి 13.7 శాతమైతే.. తెలంగాణది 15.1 శాతంగా ఉన్నది. ఇక ప్రస్తుతం తెలంగాణ తరువాత ఒక్క జార్ఖండ్ మాత్రమే రూ 3,01,673 తలసరి ఆదాయంతో ఉన్నది. దేశంలో మిగతా రాష్ర్టాలన్నీ రూ.2 లక్షల శ్రేణిలోనే ఉండటం గమనార్హం. 8 రాష్ర్టాలైతే రూ.లక్ష-రెండు లక్షల మధ్యకే పరిమితమయ్యాయి. దేశంలో అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా మేఘాలయ (రూ.98,572) నిలిచింది.