రాష్ట్రంలో 6 % పెరుగుదల
డిసెంబర్లో రూ.3,760 కోట్లు
హైదరాబాద్, జనవరి 1 : కరోనా మహమ్మారి నేపథ్యంలో మెజారిటీ రాష్ర్టాల్లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గణనీయంగా పడిపోయిన సమయంలోనూ.. తెలంగాణ రాష్ట్రం 6 శాతం వృద్ధిని సాధించడం గమనార్హం. వివిధ రంగాల్లో ఆదాయ వృద్ధిని ప్రదర్శిస్తున్నట్టే జీఎస్టీ వసూళ్లలోనూ అదే ఒరవడిని తెలంగాణ రాష్ట్రం కనబర్చింది. మరోవైపు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తోపాటు 17 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జీఎస్టీ వసూళ్లు గతం కంటే తక్కువగా నమోదయ్యాయి. 2020 డిసెంబర్‌తో పోల్చితే 2021 డిసెంబర్లో తెలంగాణ జీఎస్టీ వసూళ్లు 6 శాతం పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడించింది. 2020 డిసెంబర్లో తెలంగాణ జీఎస్టీ వసూళ్లు రూ.3,543 కోట్లుగా ఉన్నాయి. 2021 డిసెంబర్లో రూ.3,760 కోట్లుగా ఉన్నాయి. దీంతో 6 శాతం పెరిగినైట్టెంది.
దేశవ్యాప్తంగా రూ.1.29 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వరుసగా ఆరో నెలలోనూ దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లకుపైగా నమోదయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుండటం, పన్ను ఎగవేతలకు చెక్‌పెట్టడంతో డిసెంబర్లో రూ.1.29 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. 2020 డిసెంబర్లో వసూలైన రూ.1.15 లక్షల కోట్లతో పోల్చితే ఇది 13 శాతం అధికమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే నవంబర్‌లో వసూలైన రూ.1.31 లక్షల కోట్లతో చూస్తే స్వల్పంగా తగ్గాయి.