హైదరాబాద్, జూన్ 10: రాష్ట్రంలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టగా..తాజాగా ఈ జాబితాలోకి భువి బయోకెమికల్స్, ధాత్రి బయోసిలికేట్స్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలను కుదుర్చుకున్నాయి ఇరు సంస్థల ప్రతినిధులు. వీటిలో భువి బయోకెమికల్స్ రూ.1,040 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాంట్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరో సంస్థయైన ధాత్రి బయోసిలికేట్స్ రూ.160 కోట్ల పెట్టుబడితో సిలికా అండ్ బయోగ్యాస్ యూనిట్‌ను నెలకొల్పబోతున్నది. ఈ యూనిట్‌తో 250 మందికి ఉపాధి లభించనున్నాయి.
సీఎం కేసీఆర్ దక్షత వల్లే తెలంగాణలో యూనిట్లు
సీఎం కేసీఆర్ దక్షత వల్లే తెలంగాణలో యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని ధాత్రి, భువి బయో కంపెనీల ప్రతినిధులు ప్రకటించారు. ఈ సందర్భంగా ధాత్రి బయో సొల్యూషన్ ప్రతినిధి శ్యామలరావు మాట్లాడుతూ.. వరి గడ్డి నుంచి ఇథనాల్‌ను తయారు చేసే పరిశ్రమను మెట్పల్లి సమీపంలోని మెట్ల చిట్టాపూర్‌లో రూ.160 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇథనాల్‌కు సంబంధించి ముడి పదార్థాలు ఇక్కడ విరివిగా లభిస్తుండటంతో ఇక్కడ యూనిట్‌ను నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిపారు. బంగారు తెలంగాణ సాధన లాంటి గొప్ప కలగన్న దక్షుడు కేసీఆర్ అని, ఆయన తొలి సైనికుడు మంత్రి కేటీఆర్ అని అభివర్ణించారు. ఈ ఇథనాల్ పరిశ్రమ, బయోగ్యాస్ యూనిట్లను ఏర్పాటు చేయాలని పలు రాష్ర్టాల నుంచి డిమాండ్లు వచ్చినప్పటికీ చివరకు తెలంగాణను ఎంచుకున్నట్లు, అయితే సీఎం కేసీఆర్ దక్షత, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దార్శనికత చూసి తెలంగాణలోనే పరిశ్రమలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల 2 లక్షల ఎకరాల్లో పంట పండించే రైతులకు మేలు జరుగుతుందని, సేద్యంలో సాంకేతిక నైపుణ్యం, ఉత్పాదకత పెంపు జరుగుతుందన్నారు.
స్థానికులకే అవకాశం కల్పిస్తాం
వరి గడ్డి నుంచి ఇథనాల్ తయారు చేసే మా పరిశ్రమలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఈ పరిశ్రమను రూ.1040 కోట్ల వ్యయంతో 90 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేస్తాం. చత్తీస్ఘడ్, పంజాబ్ రాష్ర్టాల సీఎంలతో పాటు పలు రాష్ర్టాల నుంచి ఈ పరిశ్రమ కోసం ఒత్తిడి చేశారు. అయినా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దక్షత, నిబద్ధతను విశ్వసించి తెలంగాణలో మొదటిసారిగా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్లచిట్టాపూర్‌లో ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నాం. దీని వల్ల రెండు వేలు మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
– నాగవర్ధన్రావు,భువి బయోటెక్ డైరెక్టర్