హైదరాబాద్, ఫిబ్రవరి 14: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైలాన్ లాబొరెటరీస్ సైకోట్రోపిక్ డ్రగ్ ‘అల్ప్రాజోలం’ తయారీ లైసెన్సు రద్దయ్యింది. రాష్ట్రంలోని తయారీ యూనిట్ నుంచి ఈ ఔషధాన్ని చట్టవిరుద్ధంగా మళ్లిస్తున్నారని కనుగొనడంతో ఈ చర్య తీసుకున్నట్టు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) బుధవారం ప్రకటించింది. మానసిక రుగ్మతలకు, భయాందోళనల్ని తగ్గించడానికి ఉపయోగించే ‘అల్ప్రాజోలం’ను వినోద ఉత్ప్రేరకంగా కూడా వాడుతుంటారు.
మైలాన్ ఆవరణ నుంచి దీనిని అనధికారికంగా తరలిస్తున్నట్టు ఎక్సయిజు యంత్రాంగం ద్వారా తమ నోటీసులోకి వచ్చిందని డీసీఏ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని మైలాన్ యూనిట్ నుంచి 21.250 కిలోల ‘అల్ప్రాజోలం’ కెమిస్టులు, ప్రొడక్షన్ అధికారులుగా పనిచేసే కొంతమంది ఉద్యోగుల ద్వారా చట్టవిరుద్ధంగా తరలించినట్టు ఎక్సయిజు అధికారులు గుర్తించారన్నారు. మైలాన్ లాబ్ యూనిట్-7 ‘కన్జూమబుల్ రూమ్’లో ప్రొహిబిషన్, ఎక్సయిజు అధికారులు గత ఏడాది 4.850 కిలోగ్రాముల స్వాధీనం చేసుకున్నట్టు డీసీఏ వివరించింది. ఈ అంశమై మైలాన్కు డీసీఏ తెలంగాణ షోకాజ్ నోటీసులు చేయగా, తగిన వివరణను కంపెనీ ఇవ్వలేకపోయిందని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల రీత్యా ఈ ఔషధం తయారీ లైసెన్సును రద్దుచేస్తున్నామని, ఇది తక్షణం అమలులోకి వస్తుందని డీసీఏ తెలంగాణ వివరించింది.