MSME Policy | హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ వడ్డించిన విస్తరిలా ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చైనాకు ప్రత్యామ్నాయం భారత్ అయితే, భారత్‌కు ప్రత్యామ్నాయం తెలంగాణ అని చెప్పారు. ప్రోత్సాహకాల విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పాలసీ-2024ను సీఎం బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి ఔటర్ రింగురోడ్డు ఎంతగానో తోడ్పడుతున్నదని, ఓఆర్ఆర్కు సమాంతరంగా రీజనల్ రింగురోడ్డును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఔటర్‌ను ట్రిపుల్ఆర్ను అనుసంధానం చేసేలా రేడియల్ రోడ్లను నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. లక్షల ఎకరాల భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా, ఉత్పత్తులు పెంచేలా మౌలిక సదుపాయాలను పెంచుతున్నామని వివరించారు.
పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తు, నీరు, అందిస్తామని, భూములు సమకూర్చుతామని, భూములు కోల్పోతున్న రైతులను అందులో భాగస్వాములను చేస్తామని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దళితులు పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు అవసరమైన సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో లైఫ్‌సైన్సెస్, ఫార్మా పరిశ్రమలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.