హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్న ఐటీ, ఐటీయేతర సంస్థల ఉద్యోగులు కార్యాలయాలకు రావడం పెరుగుతున్నది. గత కొన్నిరోజులుగా రిటర్న్ టు ఆఫీస్ జోరుగా నడుస్తున్నది. ముఖ్యంగా టెలికం, కన్సల్టెన్సీ కంపెనీల్లో ఉద్యోగుల రిటర్న్ టు ఆఫీస్ అనేది అత్యధికంగా కనిపిస్తున్నది. ఇతర కంపెనీలూ ఆ దిశగా అడుగుల్ని వేగవంతం చేశాయి. ఇప్పటికే 35 శాతం కంపెనీల్లో ఉద్యోగులందరు తిరిగి కార్యాలయాలకు వస్తున్నట్టు తాజా సర్వేలో తేలింది. హైదరాబాద్ ఐటీ కారిడార్లలోనూ కొంతకాలంగా కార్యాలయాలకు ఉద్యోగుల రాక పెరగడంతో ఆ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి.
ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీల్లో కార్యాలయాలకు ఉద్యోగుల రాక రోజురోజుకీ పెరుగుతున్నట్టుగా కొల్లీర్స్-ఆఫిస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కరోనా నుంచి వర్క్ ఫ్రం హోంకు పరిమితం అవగా.. కొన్ని వారాల ముందు వరకు కంపెనీలు హైబ్రిడ్ విధానంలో ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించాయి. ఇక ఈమధ్య చాలా కంపెనీలు పూర్తిస్థాయిలో ఉద్యోగులను కార్యాలయాలకు రమ్మనడంతో క్రమంగా రిటర్న్ టు ఆఫీస్ పెరుగుతున్నది. దీంతో రెండేండ్ల తర్వాత వేలాదిమంది ఉద్యోగులు ఆఫీస్‌లలోనే పనిచేస్తున్నారు. టెలికం, కన్సల్టెన్సీ కంపెనీల్లో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తున్నది.
ఇంటా.. బయటా..
కొన్ని ఐటీ కంపెనీలు వర్క్ ప్లేస్‌లను విభజించి ఉద్యోగులతో పని చేయిస్తున్నాయి. అటు రిటర్న్ టు ఆఫీస్, ఇటు వర్క్ ఫ్రం హోం రెండింటినీ అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా 74 శాతం కంపెనీలు ఉద్యోగులకు సమీపంలో కార్యాలయాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయని సర్వేలో పేర్కొన్నారు. సగం ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీలు కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఫలితంగా హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణె వంటి నగరాల్లో ఆఫీస్ స్పేస్‌కు భారీగా డిమాండ్ పెరుగుతున్నది.
పెరిగిన రద్దీ
హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్లలో ఉద్యోగుల సందడి ఎక్కువవుతున్నది. కరోనా కారణంగా రెండేండ్లు వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు క్రమంగా ఆఫీసులకు వచ్చి పనిచేస్తున్నారు. నిజానికి ఏప్రిల్ నుంచే ఆఫీసులకు వచ్చి పనిచేయాలని యాజమాన్యాలు తమ ఉద్యోగులకు సూచించాయి. దీంతో నగరంలోని ఐటీ కంపెనీలున్న ప్రాంతాల్లో రద్దీ గణనీయంగా పెరుగుతున్నది. మాదాపూర్ హైటెక్ సిటీ, రహేజా మైండ్ స్సేస్ ఎస్ఈజెడ్, ఇనార్బిట్ మాల్, రాయదుర్గం నాలెడ్జ్ సిటీ, కొండాపూర్, డీఎల్ఎఫ్ క్యాంపస్, నానక్‌రాంగూడ, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలన్ని సందడిగా మారాయి.
ఉద్యోగ కల్పనలో హైదరాబాద్ భేష్
ఐటీ కంపెనీల్లో ఉద్యోగ కల్పన భారీగానే పెరిగింది. ఇందులో హైదరాబాద్ దేశంలోని మెట్రో నగరాల్లో ముందు వరుసలో నిలిచింది. గత రెండేండ్లలో కేవలం హైదరాబాద్ ఐటీ రంగంలోకే లక్షన్నర మంది కొత్త టెకీలు వచ్చారు. ప్రస్తుతం వీరంతా కార్యాలయాలకు వచ్చే పనిచేస్తున్నారు. దీంతో మెట్రో, ఆర్టీసీ, ప్రైవేటు రవాణా రంగంలో రద్దీ బాగా పెరిగిపోయింది.
సర్వేలోని ముఖ్యాంశాలు