ముంబై, జనవరి 12: ఆరంభం బెదిరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికాన్ని దేశీయ కార్పొరేట్లు నిరుత్సాహక ఆర్థిక ఫలితాలతో ప్రారంభించాయి. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) నిరాశపరిచింది. అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలానికిగాను సంస్థ రూ.10,657 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.12,380 కోట్ల లాభంతో పోలిస్తే 13.91 శాతం పతనం చెందింది. నూతన లేబర్ కోడ్ అమల్లోకి తీసుకురావడం వల్ల సంస్థపై రూ.2,128 కోట్ల పడిన భారం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది. క్రితం ఏడాది రూ.63,973 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.67,087 కోట్లకు ఎగబాకింది.
గత నెల చివరినాటికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 11,151 తగ్గి 5,82,163కి పరిమితమయ్యారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా 12 వేల మంది సిబ్బందిని తొలగించనున్నట్లు గతేడాది ప్రారంభంలో సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ సీఈవో, ఎండీ కే కృతివాసన్ మాట్లాడుతూ..రాబోయే రోజుల్లో వృద్ధి కొనసాగుతుందని చెప్పారు. కృత్రిమ మేధస్సు నుంచి వచ్చే ఆదాయం 17 శాతం ఎగబాకి 1.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నదని చెప్పారు. సమీక్షకాలంలో 9.3 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను చేజిక్కించుకున్నట్టు తెలిపారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.11 మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు ప్రకటించింది. దీంతోపాటు ప్రత్యేక డివిడెండ్ రూ.46 కలుపుకొని మొత్తంగా రూ.57ని వాటాదారులకు చెల్లించడానికి బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.4,076 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,591 కోట్లతో పోలిస్తే 11.2 శాతం తగ్గింది. కానీ, ఇదే సమయంలో సంస్థ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13.3 శాతం ఎగబాకి రూ.33,872 కోట్లకు ఎగబాకింది. గత త్రైమాసికంలో అన్ని విభాగాల్లో మెరుగైన వృద్ధిని సాధించినట్టు, కొత్తగా 3 బిలియన్ డాలర్ల ఒప్పందాలు జరగడం కలిసొచ్చిందని కంపెనీ సీఈవో, ఎండీ సీ విజయకుమార్ తెలిపారు. ఇటీవల కాలంలో కృత్రిమ మేధస్సుకు డిమాండ్ నెలకొన్నదని, ముఖ్యంగా ఇండస్ట్రీస్, సర్వీసెస్ రంగ క్లయింట్లకు ఈ టెక్నాలజీ ఆధారంగా సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. గత త్రైమాసికంలో కొత్తగా 2,862 మంది ఫ్రెషర్లు చేరవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,26,379కి చేరుకున్నారు. ప్రతిభ కలిగిన టెక్కీలకు జీతాలను 18 లక్షలనుంచి 22 లక్షలకు పెంచింది. మరోవైపు రెండు రూపా యల ముఖ విలువ కలిగిన ప్రతీ షేరుకు రూ.12 డివిడెండ్‌ను సంస్థ ప్రకటించింది.