TCS Job’s Scam| బీటెక్ పూర్తి చేసిన ఇంజినీర్.. టీసీఎస్ వంటి కంపెనీల్లో ఉద్యోగం చేయాలని కలలు కంటారు. కానీ, ఇందులో ఉద్యోగాలు కోరుకునే వారి నుంచి సంస్థ టాప్ స్థాయిలో పని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లే డబ్బులు వసూలు చేశారని తేలింది. భారీగా అంటే దాదాపు రూ.100 కోట్ల మేరకు ముడుపులు స్వీకరించారన్న సంగతి వెలుగు చూడటంతో టీసీఎస్ యాజమాన్యం కూడా సీరియస్‌గానే రియాక్టయింది.
రీసోర్స్ మేనేజ్మెంట్ గ్రూపు (ఆర్ఎంజీ) లో పని చేస్తున్న నలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను ఇంటికి సాగనంపింది. ఈ పరిణామాల నేపథ్యంలో సంస్థ ఆర్ఎంజీ గ్లోబల్ హెడ్ ఈఎస్ చక్రవర్తి కూడా సెలవుపై వెళ్లారు. మూడు నియామక సంస్థలను బ్లాక్ లిస్ట్‌లో చేర్చింది. అయితే, అలా బ్లాక్ లిస్ట్‌లో చేర్చిన సంస్థల పేర్లు గానీ, ఉద్వాసనకు గురైన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల పేర్లు మాత్రం బయట పెట్టలేదు.
ఐటీ రంగ కంపెనీలు ‘క్యాంపస్ సెలక్షన్స్’ తోపాటు రిక్రూట్మెంట్ సంస్థల ద్వారా కూడా ఐటీ ఇంజినీర్లను నియమించుకుంటాయి. దీని ఆసరాగా ఆర్ఎంజీ గ్లోబల్ హెడ్ ఈఎస్ చక్రవర్తి మూడు నియామక సంస్థల ద్వారా ఆశావాహులను నియమించుకున్నారని ఓ ప్రజా వేగు .. టీసీఎస్ సీఈఓ, సీఓఓలకు లేఖ రాయడంతో ఈ సంగతి బయట పడింది. దీనిపై వెంటనే రియాక్టైన టీసీఎస్ యాజమాన్యం.. త్రిసభ్య కమిటీతో విచారణకు ఆదేశించింది. ఇందులో చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అజిత్ మీనన్ కూడా భాగస్వామిగా ఉన్నారని తెలుస్తున్నది.
టీసీఎస్‌కు వివిధ సేవలు అందించే కాంట్రాక్టర్లతోపాటు మూడు లక్షల మందిని ఒక ఎగ్జిక్యూటివ్ గత మూడేండ్లలో నియమించారని తేలింది. ఈ నియామకాల్లో కనీసం రూ.100 కోట్ల ముడుపులు కమిషన్ రూపంలో సంపాదించి ఉంటారని సమాచారం.