Banking sector | సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పుడు మాత్రమే ఏవైనా మార్పులు-చేర్పులు ఎక్కువగా చూస్తూంటాం. కానీ ఈమధ్య అలా ప్రత్యేకమైన సమయం లేకుండా సందర్భానుసారంగా అనేక డెడ్‌లైన్స్ వింటున్నాం. ఎప్పటికప్పుడు వీటిని మనం అప్డేట్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశమే ఉన్నది.బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో నిత్యం ఏదో ఒక కొత్త మార్పు వస్తూనే ఉంటుంది. వాటికి అనుగుణంగా మనం కూడా ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఇలా ఈ నెల (అక్టోబర్) ఒకటో తేదీ నుంచి చోటుచేసుకున్న మార్పులేంటో చూద్దాం..
విదేశీ చదువులకూ..
ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ప్రకారం.. విద్యాభ్యాసం కోసం ఏడాదికి రూ.7 లక్షల వరకూ చేసే ఖర్చుపై ఎలాంటి టీసీఎస్ ఉండబోదు. అలా కాకుండా అంతకుమించి ఉంటే మాత్రం 5 శాతం టీసీఎస్ వసూలు చేస్తారు. ఒకవేళ లోన్ ద్వారా ఈ నగదును తీసుకుని చెల్లిస్తున్నైట్టెతే 0.5 శాతం టీసీఎస్ ఉంటుంది. కానీ దీన్ని మళ్లీ మనం క్లెయిం చేసుకోవచ్చు. అలాగే విదేశాల్లో వైద్యం కోసం చేసే ఖర్చు రూ.7 లక్షలు దాటినా కూడా 5 శాతం టీసీఎస్ పడుతుంది. మీ పిల్లల చదువులకేగాక ఇతర అవసరాల కోసం నిధులు పంపినా దాన్ని విద్యా వ్యయం కిందే పరిగణిస్తారు.
క్రెడిట్ కార్డుతో కట్టినా..
ఒకవేళ రూ.7 లక్షలకు మించి దవాఖాన ఖర్చులు, ఎడ్యుకేషన్ ఫీజు, ఫారెక్స్ కొనుగోలు వంటివి ఉన్నా 20 శాతం టీసీఎస్ తప్పదు. అది క్రెడిట్ కార్డ్ అయినా, డెబిట్ కార్డ్ అయినా ఇంతే. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన వచ్చింది. ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షల కంటే దిగువన ఉన్న ఫారెక్స్ ట్రాన్జాక్షన్స్పై మాత్రం ఎలాంటి టీసీఎస్ ఉండబోదు. రూ.7 లక్షలకు మించి చేసే విదేశీ కరెన్సీ కొనుగోళ్లపై 20 శాతం టీసీఎస్ అనేది చాలా ఆశ్చర్యకరమైన, వివాదాస్పదమైన నిర్ణయం. సెప్టెంబర్ 30 వరకు రూ.7 లక్షలదాకా ఫారెక్స్ కొనుగోలుపై 5 శాతం మాత్రమే టీసీఎస్ ఉండేది.
ఫారిన్ ప్యాకేజీ టూర్లు కష్టమే
మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఏ దేశానికైనా పర్యటనకు వెళ్లాలంటే ఇప్పుడది మరింత భారమే. రూ.7 లక్షల వరకూ ఏదైనా టూర్ ప్యాకేజీ తీసుకుంటే దానిపై 5 శాతం టీసీఎస్ అదనంగా వసూలు చేస్తాయి సదరు సంస్థలు. రూ.7 లక్షలు దాటితే ఆపై మొత్తం ఎంతైతే ఉంటుందో అందులో 20 శాతం టీసీఎస్‌గా కట్టాల్సిందే. ఇంతకుముందు ఎంతైనా 5 శాతంగానే ఉండేది. ఉదాహరణకు మీరు టూర్ ఆపరేటర్ దగ్గరికి వెళ్లి యూరప్ వెళ్లేందుకు ప్యాకేజీ బుక్ చేసుకున్నారనుకుందాం. సదరు ప్యాకేజీ ధర ఫ్యామిలీ అంతటికి కలిసి రూ.9 లక్షలు. దీంతో ఇందులో రూ.7 లక్షలకు 5 శాతం చొప్పున రూ.35,000, ఆపై రూ.2 లక్షలకు 20 శాతం చొప్పున రూ.40,000 టీసీఎస్ ఉంటుంది. మొత్తంగా రూ.9.75 లక్షలు చెల్లించాలి. అయితే మీరు అధికంగా చెల్లించిన రూ.75 వేలను ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు రిఫండ్ చేసుకోవచ్చు. లేదా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినప్పుడు క్రెడిట్ నోట్లా కూడా వాడుకోవచ్చు. కానీ భారతీయ ట్రావెల్ ఆపరేటర్స్ నుంచి టూర్ ప్యాకేజీ పొందినప్పుడే ఈ అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.
కార్డ్స్‌పై కొత్త రూల్స్
తమ ఖాతాదారులకు కొత్తగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసేటప్పుడు నెట్వర్క్ ప్రొవైడర్ (వీసా, మాస్టర్ కార్డ్, రూపే)ను బ్యాంకులే నిర్ణయించేవి. కానీ అక్టోబర్ 1 నుంచి ఇది మారిపోయింది. ఖాతాదారులే తమకు నచ్చిన నెట్వర్క్ ప్రొవైడర్‌ను ఎంచుకోవచ్చు.
ఈ నెలాఖరు వరకే..
కొన్ని సందర్భాల్లో తెలిసో, తెలియకో.. ఆర్థిక ఇబ్బందుల వలనో ఎల్ఐసీ పాలసీలను కొనసాగించలేకపోతాం. అప్పుడవి ల్యాప్స్ అయిపోతాయి. అయితే సెప్టెంబర్ 1 నుంచి ఇలా మధ్యలోనే ఆగిపోయిన పాలసీల పునరుద్ధరణకు ఎల్ఐసీ అవకాశం ఇచ్చింది. కానీ ఈ నెలాఖరుదాకే ఇది అందుబాటులో ఉంటుంది. పైగా లేట్ ఫీజుపై 30 శాతం తగ్గింపునూ అందిస్తోంది.
గరిష్ఠంగా 30 ఏండ్లే
పర్పెచ్యువల్ ఎస్ఐపి (సిప్) కింద ఇక 30 ఏండ్లకు మించి మనం సిప్‌ను కొనసాగించే వీలుండదు. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్ (నాచ్) నిబంధనల్ని సవరించింది మరి. ఇకపై మ్యూచువల్ ఫండ్ సిప్స్ జారీ అయిన తేదీ నుంచి 30 ఏండ్లే కొనసాగుతాయి. ఇంతకుముందు ఎన్నైైండ్లెనా కొనసాగించుకునే అవకాశం ఉండేది.
-నాగేంద్ర సాయి కుందవరం
టీసీఎస్ రూల్ మొదలు
టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్. వాడుక భాషలో చెప్పాలంటే మూలం వద్దే పన్ను వసూలు. విదేశీ పర్యటనలు, విదేశాల్లో క్రెడిట్ కార్డుల వినియోగం, ఫారిన్ ఈక్విటీలు-మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీల కొనుగోలు, విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లడం వంటి వాటిపై టీసీఎస్ ఉంటుంది. వీటి కోసం వినియోగించే ఖర్చులు ఒక పరిమితి దాటిన తర్వాత బ్యాంకులు సదరు మొత్తంపై టీసీఎస్‌ను వసూలు చేస్తాయి. అయితే మొత్తం ఏడాదికి చేసే ఖర్చును ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటారని గుర్తుంచుకోవాలి. లావాదేవీ ఒకసారి జరిగినా, నాలుగుసార్లు చేసినా.. సదరు పరిమితి దాటితే మీరు పన్ను పరిధిలోకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తారు. ఇలా టీసీఎస్ అదనంగా తీసుకున్న వాటిని మనం మళ్లీ మన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు క్లెయిం చేసుకునే సౌలభ్యం ఉంది. అయితే అందుకోసం రిటర్న్స్ ఫైల్ చేసేదాకా ఆగాల్సి ఉంటుంది.