న్యూఢిల్లీ, జూన్ 13: భారత్ 2047 కల్లా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే పన్నుల రేట్లు తగ్గాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పన్నుల రేట్లు తగ్గడం, పన్నుల పరిధిలోకి వచ్చేవారి సంఖ్య పెరగడం ద్వారా ప్రస్తుత పన్నుల విధానాన్ని.. రేట్ల నుంచి రెవిన్యూ దిశగా మార్చాలని సూచిస్తున్నారు. దీంతో దేశ పెట్టుబడులు, అభివృద్ధి అవసరాలకు కావాల్సిన నిధులను సృష్టించుకోవచ్చని చెప్తున్నారు. ‘సంప్రదాయక అధిక పన్ను రేట్లు.. ప్రజల్లో పన్నులు చెల్లించాలన్న ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి’ అని ఈవై ఇండియా సీనియర్ భాగస్వామి సుధీర్ కపాడియా అన్నారు. పన్నుల రేట్లను తగ్గించి, సర్చార్జీలను, సెస్సులను, భారీ కోతలను తీసివేయాలని కూడా ఆయన తాజాగా చెప్పారు.
‘భారత్.. ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నది. ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుదారులు కొద్దిగానే ఉంటున్నారు. ఎందుకంటే తక్కువ తలసరి ఆదాయం. కాబట్టి ఇక్కడ అధిక పన్ను రేట్లు సరికాదు. పన్ను ఎగవేతలకు ఆస్కారం ఉంటుంది. పన్నులను తగ్గించుకోవడానికి ప్రజలు రకరకాల మార్గాలను అన్వేషిస్తూంటారు. దీనివల్ల దేశ జీడీపీ కూడా ప్రభావితమవుతుంది’ అని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఎకనామిక్స్కు చెందిన నాయక్ అన్నారు. మొత్తానికి ప్రత్యక్ష, పరోక్ష పన్ను విధానాల్లో సంస్కరణలు రావాలని మెజారిటీ నిపుణులు అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను వచ్చే నెల పూర్తిస్థాయి బడ్జెట్ను మోదీ సర్కారు తేనున్న క్రమంలో ఈ సూచనలు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి.